ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే ఉన్నత శిఖరాలకు : బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

కలం, జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ఇక్కడ చదువుకునే పేద, మధ్యతరగతి విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నతమైన లక్ష్యాలతో చదివి అత్యున్నత స్థాయికి ఎదుగుతారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పేర్కొన్నారు. ​శనివారం జిల్లా (Gadwal) కేంద్రంలోని రెవెన్యూ కాలనీలోని పీఎం శ్రీ ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలలో రూ. 41.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను, సైన్స్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, తాను కూడా ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే చదువుకున్నానని, ఈరోజు పాఠశాలకు రావడంతో విద్యార్థి రోజుల జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన ఎంతోమంది విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉన్నారని, తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకునే ఎమ్మెల్యేగా గెలిచానని విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు.

తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులు కలిగిన టాప్-4 ప్రభుత్వ పాఠశాలలు గద్వాల నియోజకవర్గంలోనే (ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, ప్రభుత్వ అభ్యున్నత పాఠశాల, ధరూర్ జెడ్పీహెచ్ఎస్) ఉండటం గర్వకారణం అన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉపాధ్యాయులు బోధిస్తున్నారని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాక మున్సిపల్ చైర్ పర్సన్ తుమ్మల జయలక్ష్మి నరసింహులు యాదవ్, వైస్ చైర్మన్ శంకర్, 16వ వార్డు కౌన్సిలర్ వేదావతి, జిల్లా విద్యాధికారి విజయ లక్ష్మీ, మండల విద్యాధికారి శ్రీనివాసులు గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>