తెలంగాణ ఆత్మగౌరవం.. పేరిణి నాట్యం: ఎమ్మెల్యే నాయిని

కలం, హనుమకొండ: పేరిణి నాట్యం తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి (Naini Rajender Reddy) అన్నారు. శనివారం రాష్ట్ర తెలుగు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో వరంగల్ నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ నిర్వహించిన “పేరిణి నాట్య గురు-శిష్య పరంపర” కార్యక్రమాన్ని హనుమకొండ కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నాయిని రాజేందర్ రెడ్డి కళాకారుల నృత్యాలను తిలకించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అది కాకతీయుల వీరత్వానికి ప్రతీక..

ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ.. పేరిణి నాట్యం నృత్యరూపం మాత్రమే కాదని, కాకతీయుల వీరత్వాన్ని, తెలంగాణ సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించే అపూర్వమైన కళారూపమన్నారు. యుద్ధానికి వెళ్లే వీరుల్లో ధైర్యం, ఉత్సాహాన్ని నింపే శక్తి పేరిణి నాట్యానికి ఉందని పేర్కొన్నారు. ఈ కళను గురు-శిష్య పరంపర ద్వారా భావితరాలకు అందిస్తున్న గురువులు, కళాకారులు అభినందనీయులని కొనియాడారు.

సాంస్కృతిక వేదికగా కాళోజీ కళాక్షేత్రం..

కాళోజీ కళాక్షేత్రాన్ని రాష్ట్రంలోనే ప్రముఖ సాంస్కృతిక వేదికగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే నాయిని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కళాక్షేత్ర నిర్మాణాన్ని పూర్తి చేసేలా నిధులు విడుదల చేయడంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఏర్పడిందన్నారు.

ఇటువంటి వేదికల ద్వారా యువతలో సంప్రదాయ కళలపై అవగాహన, అభిరుచి పెంపొందుతుందని ఎమ్మెల్యే నాయిని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటరాజ కళాకృష్ణ, పద్మశ్రీ పురస్కార గ్రహీత ఉమా మహేశ్వరి, ధరావత్ రాజ్ కుమార్, విజయ రచన, పేరిణి నృత్య గురువులు, కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>