కలం, నిర్మల్: తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాల మేరకు క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారం, అండర్ ట్రయల్ ఖైదీల కేసుల త్వరిత విచారణ లక్ష్యంగా జిల్లా ప్రధాన న్యాయస్థానంలో శనివారం జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల (SP Janaki Sharmila) ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పెండింగ్ క్రిమినల్ కేసుల పురోగతి, చార్జ్‌షీట్లను సకాలంలో దాఖలు చేయడం, సాక్షుల హాజరు, కోర్టు సమన్లు, వారెంట్ల అమలు, నాణ్యమైన దర్యాప్తు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర న్యాయం అందించడంలో పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయస్థానాల మధ్య సమన్వయం కీలకమని అన్నారు. దర్యాప్తు అధికారులు చట్టపరమైన ప్రమాణాలను పాటిస్తూ శాస్త్రీయ ఆధారాలతో కేసులను బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ.. అండర్ ట్రయల్ ఖైదీల కేసులకు ప్రాధాన్యతనిస్తూ, పోలీసు, ప్రాసిక్యూషన్, న్యాయస్థాన అధికారులు సమన్వయంతో పని చేసి కేసులను వేగంగా పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాస్, న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీసు, న్యాయస్థాన, ఎక్సైజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

