కలం, వెబ్ డెస్క్: ఆహారం కల్తీ చేసేవారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించారు. నిత్యావసరాలు, పండ్లు, పాలు, కూరగాయలు.. ఇలా అన్నీ కల్తీ అవుతున్న ఘటనలు ఇటీవల బయటపడుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో కలిసి తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం తీరుతెన్నులు, అమలు, తీసుకురావాల్సిన సంస్కరణలపై ఎంసీహెచ్‌ఆర్‌డీలోని తన క్యాంపు కార్యాలయంలో కీలక సమీక్ష చేశారు.
కఠిన చట్టం రూపొందించండి..
ఆహార, ఔషధాల్లో కల్తీని నివారించేందుకు కఠిన చట్టం రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. దీని కోసం వివిధ దేశాల్లో అమలవుతున్న చట్టాలను వెళ్లి పరిశీలించాలని సూచించారు. వాటి ఆధారంగా.. రాష్ట్ర అవసరాలకు తగ్గట్లుగా బిల్లు రూపొందించాలని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టడంతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించాలని తెలిపారు. వీటన్నింటినీ క్రోడీకరించి.. సమగ్ర చట్టం తీసుకురావాలన్నారు.
సరైన వ్యవస్థలే లేవు..
కూరగాయలు, పాలు, పండ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు వీలుగా ప్రమాదకరమైన రసాయనాలు వాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పంట ఉత్పత్తుల్లోనూ రసాయన అవశేషాలు బయటపడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో బయటపడుతున్నాయని వివరించారు.
మొత్తంగా ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందన్నారు. సేంద్రియ ఉత్పత్తులు అంటూ అధిక ధరలకు ప్రజలకు విక్రయిస్తున్నారని.. అవి నిజంగా సేంద్రియమో.. కాదో.. నిర్దారించే వ్యవస్థలే లేవన్నారు.
టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..
కల్తీ ఆహారం, ఔషధాల కల్తీని నివారించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తీసుకురావాలని.. స్వచ్ఛంద సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కల్తీని నిరోధించే క్రమంలో మొదటగా హైదరాబాద్‌లోని క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని, అమలు చేయాలని సీఎస్ సంజయ్ జాజును ఆదేశించారు. అక్కడ వచ్చిన ఫలితాల ఆధారంగానే.. రాష్ట్రమంతటా అమలు చేయాలని సూచించారు.

