కలం, ఖమ్మం బ్యూరో: ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన వజ్రాయుధమని, అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటరు జాబితాలో ప్రతి ఓటును సంరక్షించడం బీఆర్ఎస్ కార్యకర్తల ప్రాథమిక బాధ్యత అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) అన్నారు. శనివారం ఖమ్మం (Khammam) నియోజకవర్గంలోని టూ టౌన్ పరిధిలో పార్టీ ముఖ్య నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలతో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ (SIR) ప్రక్రియపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఎస్ఐఆర్ గడువు పొడిగించబడిన నేపథ్యంలో ఈ అవకాశాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి అర్హులైన ఓటరు పేరు తప్పనిసరిగా ఓటరు జాబితాలో ఉండేలా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి పని చేయాలని కోరారు. రాజకీయంగా కీలకమైన ఈ సమయంలో పొరపాటున కూడా ఒక్క అనుకూల ఓటు జాబితా నుంచి తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని, ఓటరు జాబితాను నిరంతరం పరిశీలించాలని పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) సూచించారు.
ఓటరు నమోదు, సవరణల ప్రక్రియపై కార్యకర్తలకు సమగ్ర అవగాహన కల్పించారు. కొత్త దరఖాస్తుల పరిశీలన, అవసరమైన పత్రాల సమర్పణ, ఓటరు జాబితాలో తలెత్తే అభ్యంతరాల పరిష్కారం వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. క్షేత్రస్థాయిలో ఓటర్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో టూ టౌన్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, బూత్ స్థాయి కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: కేసీఆర్‌పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

