‘మత విద్వేషాలు వద్దు’.. తెలంగాణ చౌక్ వేదికగా నిరసన జ్వాల!

కలం, కరీంనగర్ బ్యూరో : హిందుత్వం పేరుతో విజయ విహారం పత్రిక వ్యవస్థాపకుడు, జై భారత్ (Jai Bharat) జాతీయ అధ్యక్షుడు రమణమూర్తిపై మతోన్మాది కశ్యప్ రెడ్డి టీవీ డిబేట్‌లో చెప్పుతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ కరీంనగర్ (Karimnagar) తెలంగాణ చౌక్ వద్ద నల్ల బ్యాడ్జీలతో కెవిపిఎస్, జై భారత్, యూసిఐడిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్, జై భారత్ జిల్లా అధ్యక్షుడు దండు అంజయ్య మాట్లాడుతూ.. భావ ప్రకటనా స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని అన్నారు. భిన్నాభిప్రాయాలను హింసతో కాకుండా చర్చల ద్వారా ఎదుర్కోవాలని, ప్రజాస్వామ్యంలో విమర్శలను సహించే సంస్కృతి పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

రమణమూర్తిపై జరిగిన దాడిపై పోలీసులు ఫిర్యాదును చట్టప్రకారం విచారించి, వాస్తవాలను నిర్ధారించి, బాధ్యులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో రచయితలు, పాత్రికేయులు, కళాకారులు, మేధావులు భయాందోళనలు లేకుండా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.

సమాజంలో మత విద్వేషాలు, హింస, అసహనం పెరగకుండా ప్రతి పౌరుడు రాజ్యాంగ విలువలను గౌరవించాలని, అన్ని మతాల పట్ల పరస్పర గౌరవం, శాంతి, సామరస్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టే చర్యలను ఎవరైనా చేపట్టినా చట్టం ముందు సమానంగా బాధ్యత వహించాల్సిందేనని అన్నారు.

జై భారత్ రమణమూర్తిపై జరిగిన భౌతిక దాడిని ప్రజాస్వామ్యవాదులు, మతపెద్దలు, ప్రజాసంఘాలు తీవ్రంగా ఖండించాలని చెప్పుకొచ్చారు. రచయితలు, పాత్రికేయులు, కళాకారులు, మేధావులపై బెదిరింపులు, దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపట్టాలి. మతం పేరుతో ద్వేషం, హింసను ప్రోత్సహించే చర్యలను అరికట్టి, రాజ్యాంగ విలువలు, శాంతి, సామరస్యాన్ని పరిరక్షించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా నాయకులు కండె రాజు, దుర్గం ప్రగ్నేష్ కుమార్, గొల్లపల్లి లచయ్య, కొండ సురేష్, క్యదసి కుమార్, జై భారత్ నాయకులు కే రాజమల్లు, జీవన్ , యూసీఐడి నాయకులు ఎండి హుస్సేన్, ఎస్కే గౌస్ సయ్యద్, జవీద్ లు పాల్గొన్నారు.

Read Also: బండి, ఈటల మధ్య కుదిరిన రాజీ..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>