కలం, కరీంనగర్ : పార్కింగ్ స్థలాలు లేకుండా నిర్వహిస్తున్న వైన్స్, బార్‌లు, పర్మిట్ రూములపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని.. అఖిల భారత యువజన సమైక్య (AIYF) కరీంనగర్ (Karimnagar) జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిబోజుల సంతోష్ చారి డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని అంబేడ్కర్ స్టేడియం చౌరస్తా పరిసర ప్రాంతాలలో ఉన్న వైన్స్, బార్‌లు పార్కింగ్ సదుపాయం లేకుండానే కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు. స్మార్ట్ సిటీ పనులలో భాగంగా నిర్మించిన ఫుట్‌పాత్‌లను ఆక్రమించి, రోడ్లపైనే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.
వైన్స్, బార్‌లకు వచ్చే వాహనాలను రోడ్లకు ఇరువైపులా నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సంతోష్ చారి పేర్కొన్నారు. గంటల తరబడి రోడ్లపైనే మద్యం సేవించడం వల్ల మహిళలు, విద్యార్థులు, వాకర్లు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టేడియం పరిసర ప్రాంతాలలో అనేక పాఠశాలలు ఉన్నాయని, ప్రతిరోజూ వేలాది మంది వాకింగ్ కోసం స్టేడియానికి వస్తుంటారని తెలిపారు. ఇలాంటి ప్రాంతాలలో పార్కింగ్ లేకుండా వైన్స్, బార్‌లు నిర్వహించడం వల్ల ట్రాఫిక్ సమస్యలు, గొడవలు, ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
ఎవరైనా దీనిపై ప్రశ్నిస్తే కొందరు మద్యం సేవించిన వ్యక్తులు గొడవలకు దిగుతున్నారని ఆరోపించారు. చిన్న చిన్న వీధులను కూడా వాహనాలతో పూర్తిగా ఆక్రమిస్తున్నారని పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్, పోలీస్, మున్సిపల్ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని సంతోష్ చారి విమర్శించారు. కరీంనగర్‌లోని పలు వైన్స్, బార్‌ల వద్ద ఇదే పరిస్థితి ఉందని తెలిపారు. తక్షణమే పోలీస్, ఎక్సైజ్, మున్సిపల్ అధికారులు స్పందించి పార్కింగ్ సదుపాయం లేని వైన్స్, బార్‌లు , రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు లేకుండా ప్రయాణించేలా చర్యలు చేపట్టాలని కోరారు. లేనిపక్షంలో ప్రజలు, వాకర్లను కలుపుకుని AIYF కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సంతోష్ చారి హెచ్చరించారు.

