కలం, వెబ్ డెస్క్ : గుంటూరు (Guntur) నగరంలో సభ్య సమాజం తలదించుకునేలా అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలోని నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో గల కృష్ణబాబు కాలనీలో ఈ నెల 15వ తేదీన ఈ ఘోరం చోటు చేసుకుంది. ఇంటి ముందు ఉన్న కుళాయి నుండి మోటార్ ద్వారా నీళ్లు పట్టుకునే విషయమై వచ్చిన బోరు నీటి వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి ఆ మహిళతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, ఆ విషయం తెలుసుకున్న వెంకటరమణమూర్తి తన సోదరి (ట్రాన్స్‌జెండర్ మాధవి)తో పాటు మరికొందరిని వెంటేసుకుని ఆమెపై దాడికి తెగబడ్డాడు.
సదరు మహిళను, ఆమె కుటుంబ సభ్యులను వెంటపడి విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా, కృష్ణబాబు కాలనీ నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసి దారుణంగా హింసించారు. తమను వదిలిపెట్టాలని బాధితులు ఎంతగా వేడుకున్నా నిందితులు కనికరించకుండా ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడి దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఉదంతంపై గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీవ్రంగా స్పందించారు. మహిళపై అమానవీయ దాడికి పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక టీడీపీ నేత మల్లెల వెంకటరమణమూర్తి ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తూ, అతనిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన నగరంపాలెం పోలీసులు వెంకటరమణమూర్తి, అతని సోదరితో సహా మొత్తం తొమ్మిది మందిపై నిర్దిష్ట సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు, నిందితులను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

