కలం, ఖమ్మం బ్యూరో : ఆధునిక సాంకేతికత అంగారక గ్రహంపై జెండా పాతేస్తోంది. వైద్య విజ్ఞానం గుండెను మార్చి కొత్త ప్రాణం పోస్తోంది. కానీ, అడవి బిడ్డల గడపల్లో మాత్రం కాలం ఇంకా మధ్యయుగాల నాటి కటిక చీకట్లోనే మగ్గిపోతోంది. నాగరిక ప్రపంచానికి కొద్ది మైళ్ల దూరంలో ఉండే గిరిజన పల్లెల్లో నేటికీ మూఢనమ్మకాల పిశాచం అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. అర్హత లేని నాటు వైద్యుడి రాక్షసత్వానికి ఒక నిండు గర్భిణి, ఆమె గర్భంలో ఎదుగుతున్న ఆరు నెలల పసి ప్రాణం బలికావడం సభ్య సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. భద్రాచలం (Bhadrachalam) – ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మారాయిగూడెం గ్రామంలో భూత వైద్యం పేరిట జరిగిన ఈ ఘోర కలి అటవీ ప్రాంతాన్ని కన్నీటి సముద్రంలో ముంచేసింది.
కంటి నిండా ఆశలు.. కడుపులో పసి ప్రాణం!
ఆమె పేరు కురసం హెన్కి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కుంట మండలం మారాయిగూడెం అనే మారుమూల గిరిజన గ్రామానికి చెందిన మహిళ. ఆరు నెలల గర్భవతి. త్వరలోనే తన ఒడిలోకి రాబోయే కొత్త ప్రాణం కోసం ఎన్నో కలలు కంది. కానీ, విధి ఆమెపై పగబట్టింది. ఒక రోజు ఒక్కసారిగా ఆమె ముఖం, మెడ భాగంలో తీవ్రమైన వాపు వచ్చి అస్వస్థతకు గురైంది. గర్భధారణ సమయంలో వచ్చే ఇలాంటి శారీరక మార్పులకు తక్షణమే ఆధునిక వైద్యం అందించాలని ఆ కుటుంబానికి తెలియదు. అక్షరజ్ఞానం లేని ఆ అమాయక గిరిజన కుటుంబం.. ఆ వాపుకు కారణం ఏదో దుష్టశక్తి అని భావించింది.
భూత వైద్యం పేరిట రాక్షస కాండ..
గర్భిణి అని కూడా చూడకుండా ఆమెను స్థానికంగా ‘వెజ్జు’ అని పిలిచే ఒక నాటు వైద్యుడి (భూత వైద్యుడు) దగ్గరకు తీసుకువెళ్లారు. అక్కడే ఆ గర్భిణికి నరకం ఎదురైంది. వైద్యుడి ముసుగులో ఉన్న ఆ నకిలీ మాంత్రికుడు కనీస మానవత్వం మరిచాడు. మెడపై ఉన్న వాపును వదిలించడానికంటూ వింత చికిత్సకు తెరలేపాడు. తన నోటి పళ్లతో, బలాన్నంతా ఉపయోగించి ఆ గర్భిణి మెడపై గట్టిగా కొరికాడు.
ఆ రాక్షస చేష్టకు ఆ గర్భిణి నరకయాతన అనుభవించింది. అసలు అనారోగ్యం కంటే ఆ పంటి గాటు వల్ల కలిగిన నొప్పితో గిలగిలా కొట్టుకుంటూ, ఊపిరి ఆడక అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది. పరిస్థితి విషమించడంతో హుటాహుటిన ఆమెను సరిహద్దు దాటించి భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
మృత్యువుతో పోరాడి.. కడుపులోని బిడ్డతో సహా అనంత లోకాలకు..
అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న ఆమెను చూసి భద్రాచలం వైద్యులు చలించిపోయారు. ఊపిరి ఆడని స్థితిలో ఉన్న ఆమెకు శ్వాస అందించేందుకు ఇన్ ట్యూబేషన్ పద్ధతి ద్వారా కృత్రిమ శ్వాస అందిస్తూ, ఐసీయూలో వెంటిలేటర్ పై ఉంచి రాత్రింబవళ్లు శ్రమించారు. ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ తల్లి, వైద్యుల శతవిధ ప్రయత్నాలూ ఫలించకుండా గురువారం రాత్రి కన్నుమూసింది. ఆమె ప్రాణాలతో పాటే గర్భంలోని శిశువు కూడా కన్ను తెరవకుండానే అనంత లోకాలకు వెళ్లిపోయింది.
ఇంకా వదలని మూఢ నమ్మకాలు.. ఇంకెన్నాళ్లీ బలులు?
ఈ విషాదం కేవలం ఒక వైద్యుడి క్రూరత్వానికి ముగింపు కాదు.. నేటికీ గిరిజన అడవుల్లో రాజ్యమేలుతున్న మూఢనమ్మకాల వికృత రూపం. గిరిజన తండాల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటనే అద్దం పడుతోంది. ప్రాణం పోసే వైద్యం ఎప్పుడైతే నకిలీల చేతుల్లోకి వెళ్తుందో, అప్పుడు ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమనే చేదు నిజాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
ఇప్పటికైనా ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు మేల్కోవాలి. గిరిజన ప్రాంతాల్లో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చైతన్య రథాలు నడపాలి. వైద్యం పేరిట అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడే ఇలాంటి నకిలీ డాక్టర్లు, భూత వైద్యులపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అప్పుడే ‘హెన్కి’ లాంటి మరో అమాయక తల్లి బలికాకుండా కాపాడ బడుతుంది.

