కలం, నారాయణపేట: నారాయణ పేట (Narayanpet) జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు సురక్షిత ప్రయాణం కల్పించడం లక్ష్యంగా జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ఈ సమావేశానికి కలెక్టర్ సీహెచ్ ప్రియాంక (Collector Priyanka) అధ్యక్షత వహించగా.. జిల్లా ఎస్పీ వినీత్ (SP Vineeth) హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రహదారులపై అవసరమైన హెచ్చరిక బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ లిమిట్ బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలల పరిసరాలను స్కూల్ సేఫ్టీ జోన్లుగా అభివృద్ధి చేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. అదేవిధంగా ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలను తొలగించి పాదచారులకు సౌకర్యవంతమైన మార్గం కల్పించాలని, ప్రధాన రహదారులపై పార్కింగ్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి శాఖ తమ పరిధిలోని రోడ్డు భద్రతా పనులపై నివేదికలను సకాలంలో సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదాల సమయంలో అత్యవసర వైద్య సేవలు వేగంగా అందించేందుకు 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేయాలని, జాతీయ రహదారులపై అవసరమైన చోట అదనపు అంబులెన్సులు, అత్యవసర స్పందన కేంద్రాలు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సమావేశంలో నిర్ణయించారు. రోడ్డు ప్రమాద బాధితులకు సహాయం చేసే గుడ్ సమారిటన్ (Good Samaritan) పథకంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రమాద బాధితులకు సహాయం చేసే వ్యక్తులను ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు.
జిల్లా ఎస్పీ వినీత్ (SP Vineeth) మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్, సీట్ బెల్ట్, మైనర్లు వాహనాలు నడపడం, ఫిట్నెస్ లేని వాణిజ్య వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని అధికారులకు సూచించారు. రోడ్డు భద్రతపై గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ విద్యాసంస్థల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలని జిల్లా కలెక్టర్ (Collector Priyanka), జిల్లా ఎస్పీ సూచించారు. సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టిన చర్యలను వివరించి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ, పోలీసు శాఖ, రోడ్లు & భవనాల శాఖ, జాతీయ రహదారుల అధికారులు, ఆర్టీసీ, 108 అంబులెన్స్ సేవలు, విద్యాశాఖతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Also: స్కూటీలు ఎత్తుకెళ్లండి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Follow Us On: Sharechat

