కలం, హుస్నాబాద్: పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యం, ప్లాస్టిక్ రహిత గ్రామాలు అనే మూడు ప్రధాన లక్ష్యాలతో ‘స్టీల్ బ్యాంక్’ (Steel Bank) కార్యక్రమం ప్రారంభమైంది. గతేడాది మొదలైన ఈ ఉద్యమం నేటితో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ (Husnabad) లక్ష్యంతో ప్రారంభమైన స్టీల్ బ్యాంక్.. నేడు ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకోవడం ఆనందదాయకమన్నారు.
స్వర్గీయ పొన్నం సత్తయ్య సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ.. ఆయన జ్ఞాపకార్థం పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గత గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 2026, జూలై 17న ఈ ‘స్టీల్ బ్యాంక్’ను ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం నేడు గ్రామాల్లో పర్యావరణ చైతన్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు.
ప్లాస్టిక్‌పై పోరాటం
ప్లాస్టిక్ వినియోగాన్ని కేవలం నిషేధించడం కాకుండా, దానికి శాశ్వత ప్రత్యామ్నాయాన్ని అందించాలనే ఆలోచనతో గ్రామ మహిళా సంఘాల ద్వారా స్టీల్ బ్యాంకులను ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని 276 గ్రామ మహిళా సమైక్య సంఘాలకు మొత్తం 276 స్టీల్ బ్యాంక్ సెట్లను పూర్తిగా ఉచితంగా అందించామని తెలిపారు.
ఒక్కో సెట్‌లో 13 రకాల స్టీల్ పాత్రలు ఉండేలా 300, 400, 500 పాత్రల సామర్థ్యంతో గ్రామాల అవసరాలకు అనుగుణంగా పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా 7,376 స్వయం సహాయక సంఘాలకు చెందిన 80,633 మంది మహిళా సభ్యులు ప్రత్యక్షంగా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం రూ.2.54 కోట్లకుపైగా సొంత నిధులను వెచ్చించడం సేవా దృక్పథానికి నిదర్శనమన్నారు.
గ్రామాల్లో జరిగే వివాహాలు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామసభలు లాంటి కార్యక్రమాల్లో ప్లాస్టిక్ పాత్రలకు బదులుగా స్టీల్ పాత్రల వినియోగం విస్తృతంగా పెరిగిందని మంత్రి తెలిపారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గి గ్రామాలు మరింత పరిశుభ్రంగా మారాయని పేర్కొన్నారు. గ్రామాలతోపాటు వాణిజ్య సంస్థల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
నియోజకవర్గంలోని 319 హోటళ్లకు 33,900 స్టీల్ గ్లాసులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేసినట్టు తెలిపారు. ఒక్కసారి ఉపయోగించే ప్లాస్టిక్ గ్లాసులకు శాశ్వత ప్రత్యామ్నాయం కల్పించినట్లు వివరించారు. మహిళా సంఘాలు స్టీల్ బ్యాంకులను సమర్థవంతంగా నిర్వహిస్తూ పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి ప్రశంసించారు.
ప్రజల భాగస్వామ్యంతో
ప్రజల్లో బాధ్యత పెరగడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం తగ్గి, పరిశుభ్రమైన జీవన విధానం అలవాటవుతోందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనతోపాటు నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటడం, చెరువుల అభివృద్ధి, ప్రజా ప్రదేశాల సుందరీకరణ కార్యక్రమాలను చేపట్టామని మంత్రి తెలిపారు. ఎల్లమ్మ చెరువు, పల్లె చెరువు, కొత్త చెరువు పరిసరాల అభివృద్ధి, త్రిశూలం జంక్షన్, గాంధీ విగ్రహం పరిసరాల సుందరీకరణ, “ఐ లవ్ హుస్నాబాద్’, యోగా లోగోలతో కూడిన డివైడర్లు, ఎల్కతుర్తి చౌరస్తా లాంటి ప్రాంతాలు పచ్చదనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని, సమాజంలో శాశ్వత మార్పు తీసుకువచ్చే ఆలోచనలే నిజమైన అభివృద్ధి అని పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ రహిత హుస్నాబాద్ లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందన్నారు. భావితరాలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నియోజకవర్గాన్ని అందించేందుకు కృషి కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
మహిళా సంఘాల ఘన విజయం
“ప్లాస్టిక్ రహిత గ్రామాల నుంచి- ప్లాస్టిక్ రహిత హోటళ్ల వరకు, అక్కడి నుంచి ప్లాస్టిక్ రహిత తెలంగాణ వైపు కొనసాగే ప్రజా ఉద్యమమే స్టీల్ బ్యాంక్ కార్యక్రమం (Steel Bank)” అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, శుభకార్యాలు, అన్నదానాలు, గ్రామ సభలు లాంటి కార్యక్రమాల్లో ఒకప్పుడు పెద్దఎత్తున ప్లాస్టిక్ పాత్రలు వినియోగించేవారని, ప్రస్తుతం స్టీల్ బ్యాంక్ ద్వారా అందుబాటులో ఉన్న స్టీల్ పాత్రలనే ఎక్కువగా ఉపయోగిస్తున్నామని తెలిపారు. దీంతో ప్లాస్టిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గి గ్రామాలు పరిశుభ్రంగా మారాయని చెప్పారు.
ప్లాస్టిక్ రహిత గ్రామాల అభివృద్ధిపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించామని పేర్కొన్నారు. స్టీల్ బ్యాంక్ నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించడం తమపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలకు అవసరమైనప్పుడు పాత్రలను అందిస్తున్నారు. వాటిని భద్రపరుస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని మహిళా సంఘాలు తెలిపాయి.
Read Also: స్కూటీలు ఎత్తుకెళ్లండి.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
Follow Us On : WhatsApp

