కలం, వెబ్ డెస్క్ : సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో దారుణమైన ఘటన వెలుగుచూసింది. బండరామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (Bandaramaram ZPHS) లో ఉపాధ్యాయుల మధ్య రేగిన వివాదం చివరకు పాఠశాల మూసివేత దిశగా సాగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గత కొంతకాలంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు (HM) హకీం, అక్కడి ఉపాధ్యాయుల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. రోజురోజుకూ ముదిరిపోయిన ఈ వివాదం చివరకు పాఠశాల ప్రాంగణంలోనే ఒకరినొకరు కొట్టుకునే స్థాయికి చేరింది.
ఈ గొడవ మరింత ముదరడంతో, ఉపాధ్యాయులు పరస్పరం సవాల్ విసురుకుంటూ అసలు స్కూలే లేకుండా చేస్తామని ప్రతినబూనారు. ఇందులో భాగంగానే హెడ్ మాస్టర్ హకీం విద్యార్థులందరికీ ఏకపక్షంగా టీసీలు ఇచ్చి ఇంటికి పంపించేశారు. విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతూ తీసుకున్న ఈ నిర్ణయం తీవ్ర సంచలనంగా మారింది.
ఈ వ్యవహారం మీడియా ద్వారా బయటకు రావడంతో విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించారు. ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ హెడ్ మాస్టర్ హకీంను సస్పెండ్ చేశారు. అలాగే ఈ గొడవతో సంబంధం ఉన్న మరో నలుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.

