కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) లో గణపతి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల ఆంక్షలు, శాంతిభద్రతల వైఫల్యంపై కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక సప్తగిరి కాలనీలో వినాయక మండపాల ఏర్పాటుకు పోలీసులు అనుమతులు నిరాకరించడంతో, కాలనీవాసుల అభ్యర్థన మేరకు శుక్రవారం ఆయన అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించారు.
పోలీసుల తీరుపై విమర్శల జడివాన
ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పోలీసులకు గతంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉండేదని, కానీ నేడు కరీంనగర్ పోలీసుల వైఫల్యంతో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయని ఆరోపించారు. “38 ఏళ్లుగా ఈ ప్రాంతంలో ప్రజలు గణపతి, దుర్గా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అలాంటిది ఇప్పుడు మండపాలు పెట్టవద్దని చెప్పడం ఎంతవరకు సమంజసం?” అని ఆయన పోలీసులను ప్రశ్నించారు. కేవలం ఒక రాజకీయ పార్టీకి (బీజేపీ) అనుకూలంగా వ్యవహరిస్తూ, ఇతర మండపాలకు అనుమతులు నిరాకరించడం సరికాదన్నారు.
బొమ్మకల్ ఘటనపై ఆగ్రహం
బొమ్మకల్ హనుమాన్ విగ్రహం చోరీ ఘటనను ఆయన ప్రస్తావిస్తూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విగ్రహాన్ని దొంగిలించిన వ్యక్తులను పట్టుకోవాల్సిన పోలీసులు, అది ఎక్కడుందో వెతికి పట్టుకుని ప్రతిష్టించిన తనపై, బీఆర్ఎస్ శ్రేణులపైనే క్రిమినల్ కేసులు నమోదు చేయడం విడ్డూరమన్నారు. “దేవుని విగ్రహాలను చోరీ కాకుండా కాపలా కాయాల్సిన దుస్థితి రావడం పోలీసుల అసమర్థతకు నిదర్శనం” అని ఆయన విమర్శించారు.
రాజమర్యాదలా?
తన క్యాంపు కార్యాలయంపై బీజేపీ శ్రేణులు దాడి చేసినప్పుడు వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయకుండా, పైగా స్టేషన్కు పిలిపించి రాజమర్యాదలు చేసి పంపడం దేనికి సంకేతమని ఆయన పోలీసులను నిలదీశారు. కరీంనగర్లో శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీస్ కమిషనర్ దేనని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, కరీంనగర్ పోలీసు వ్యవస్థను గాడిన పెట్టాలని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టాలని గంగుల డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

