కలం, వెబ్ డెస్క్ : తొమ్మిదేళ్ల బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని స్థానికులు చితకబాదడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఘటన హైదరాబాద్‌లోని కుల్సుంపుర (Kulsumpura) పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కుల్సుంపుర (Kulsumpura) పరిధిలో నాలుగో తరగతి చదువుతున్న ఓ తొమ్మిదేళ్ల బాలికపై అజీజ్ అహ్మద్ అనే వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ దృశ్యాలను చూసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నిందితుడు అజీజ్ అహ్మద్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ఈ దాడిలో అజీజ్ తీవ్రంగా గాయపడటంతో స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని వెంటనే ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కుల్సుంపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు కుల్సుంపుర ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

