ఇస్రోకు ఊహించని షాక్.. అసలు కారణం ఇదేనా?

కలం, బెంగళూరు: ఎన్నో ఏండ్ల తర్వాత అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ ఒక మెట్టుకు చేరుకున్నది. ఇప్పుడు అగ్ర దేశాలను అందుకునేందుకు పోటీ పడుతున్నది. చంద్రయాన్–3, గగన్‌యాన్ లాంటి ప్రతిష్టాత్మక మిషన్లను చేపట్టింది. ఇలాంటి కీలక తరుణంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO)ను ఒక సమస్య కలవరపెడుతున్నది. గత కొన్ని నెలల్లో దాదాపు 120 మందికి పైగా సీనియర్ సైంటిస్టులు రాజీనామా చేయడం ఆందోళన కలిగిస్తున్నది.

రెండు సెంటర్లపై ప్రభావం..

ఇస్రోలోని సీనియర్ సైంటిస్టులు ఒక్కొక్కరుగా సంస్థను వీడి వెళ్లిపోతున్నారు. కొందరు రాజీనామా చేస్తే, మరికొందరు వాలంటరీ రిటైర్‌‌మెంట్ తీసుకుంటున్నారు. ఇస్రో (ISRO) చేపట్టిన కీలక ప్రాజెక్టుల్లో ముఖ్య పాత్ర పోషించిన అనేక మంది శాస్త్రవేత్తలు వీరిలో ఉన్నారు. ఇటీవల కాలంలో స్పేడెక్స్ (SpaDeX), చంద్రయాన్-3, లాంచ్ వెహికల్ మార్క్-3 (LVM3) వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులలో పనిచేసిన నిపుణులతో సహా దాదాపు 120 మందికి పైగా గ్రూప్ ఏ కేటగిరీ సైంటిస్టులు, సాంకేతిక నిపుణులు ఇస్రోకు రాజీనామా చేశారు. దీంతో ఇస్రోకు చెందిన రెండు కీలక పరిశోధన కేంద్రాలపై తీవ్ర ప్రభావం పడింది.

బెంగళూరులోని యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ నుంచి అత్యధికంగా 80 మందికి పైగా రాజీనామా చేశారు. వీరిలో స్పేస్ డాకింగ్ ప్రయోగం (SpaDeX) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఆదిత్య రాళ్లపల్లి, చంద్రయాన్-3 సిమ్యులేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి అగ్రశ్రేణి శాస్త్రవేత్తలు ఉన్నారు. తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ నుంచి దాదాపు 20 మందికి పైగా సీనియర్ శాస్త్రవేత్తలు పదవీ విరమణ/రాజీనామా చేశారు. వీరిలో LVM3 ప్రోగ్రామ్ లాంచ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్ కూడా ఉన్నారు.

ఎందుకిలా?

భారత్‌లో శరవేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ అంతరిక్ష రంగం, ఆ కంపెనీలు భారీ ప్యాకేజీలు ఆఫర్ చేస్తుండటమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తున్నది. భారత్‌లో అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరించిన తర్వాత దేశీయంగా స్పేస్ స్టార్టప్‌లు పెరిగాయి. అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఏరోస్పేస్, పిక్సెల్ వంటి సంస్థలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రైవేట్ కంపెనీలకు నైపుణ్యం కలిగిన, అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తల అవసరం చాలా ఉంది. దీంతో వాళ్లు ఇస్రో నిపుణులకు భారీ అవకాశాలు కల్పిస్తున్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రభుత్వ పే-స్కేల్ ప్రకారమే జీతాలు ఉంటాయి. కానీ ప్రైవేట్ కంపెనీలు, స్టార్టప్‌లు వీరికి భారీ ప్యాకేజీలను, స్టాక్ ఆప్షన్లను ఆఫర్ చేస్తున్నాయి. ఒకప్పుడు ఇస్రో రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌కు వచ్చిన ఐఐటీ గ్రాడ్యుయేట్లలో దాదాపు 60% మంది అక్కడి జీతాలను చూసి వెనక్కి వెళ్లిపోయారని ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ గతంలో ఓసారి వెల్లడించారు.

రంగంలోకి కేంద్రం.. రూల్స్ కఠినం

సీనియర్ సైంటిస్టుల రాజీనామాలతో కేంద్రం అప్రమత్తమైంది. చంద్రయాన్–3, గగన్‌యాన్ వంటి కీలకమైన ప్రాజెక్టులపై ప్రభావం పడకుండా చర్యలు చేపట్టింది. సైంటిస్టుల రాజీనామా, వలంటరీ రిటైర్‌‌మెంట్‌కు సంబంధించిన రూల్స్‌ను కఠినతరం చేస్తూ డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ ఈ నెల 14న మెమోరాండం జారీ చేసింది.

గతంలో (2020 ఉత్తర్వుల ప్రకారం) ఇస్రో రీజినల్ సెంటర్ల డైరెక్టర్లే సైంటిస్టుల రాజీనామాలను ఆమోదించేవారు. కానీ ఇకపై కీలక ప్రాజెక్టుల్లో పనిచేసే గ్రూప్ ఏ సైంటిస్టుల రాజీనామాలు లేదా వీఆర్‌ఎస్ దరఖాస్తులను నేరుగా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ కేంద్ర కార్యాలయానికి పంపి, అక్కడ తుది అనుమతి పొందాల్సి ఉంటుంది. ఇకపై ప్రాజెక్టులు మధ్యలో ఉన్నప్పుడు శాస్త్రవేత్తల రాజీనామాలను గతంలో లాగా సాధారణ పద్ధతిలో ఆమోదించకూడదు.

కేంద్ర నిర్ణయాలపై భిన్నాభిప్రాయాలు

నిబంధనలు కఠినతరం చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాలపై అంతరిక్ష రంగ నిపుణులు, ఇస్రో మాజీ అధికారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘కేవలం పరిపాలనాపరమైన ఆంక్షలు విధించడం లేదా బలవంతంగా ఆపడం వల్ల శాస్త్రవేత్తల్లో పని మీద ఆసక్తి తగ్గుతుంది. ప్రైవేట్ స్టార్టప్‌లు ఇస్రో కంటే మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు, సౌలభ్యాలను కల్పిస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే సంస్థాగత లోపాలను సరిదిద్దాలి. ఇస్రోలో ప్రోత్సాహకాలను మెరుగుపరచాలి” అని వాళ్లు అంటున్నారు.

వస్తుంటారు.. పోతుంటారు

ఇస్రో ఇష్యూపై సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ వివాదాస్పద కామెంట్స్ చేశారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ జారీ చేసిన మెమోపై ఆయన స్పందిస్తూ.. ‘‘కేవలం పరిపాలనా పరంగా తీసుకున్న నిర్ణయమది. ఇస్రోలో చాలామంది పని చేస్తున్నారు. ఎంతోమంది వస్తుంటారు.. పోతుంటారు” అని వ్యాఖ్యానించారు. ఇస్రో (ISRO) మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రైవేట్ స్పేస్ స్టార్టప్‌లో చేరడంపై స్పందిస్తూ.. ‘‘దాదాపు పదేళ్ల క్రితం సోమనాథ్ చెప్పిన మాటలను మనం గుర్తుంచుకోవాలి.

మనిషిని అంతరిక్షంలోకి పంపడం సులభమే కానీ, వారిని సురక్షితంగా తిరిగి భూమిపైకి తీసుకురావడమే అత్యంత కష్టమైన పని. గగన్‌యాన్ కోసం అభివృద్ధి చేస్తున్న‘క్రూ మాడ్యూల్’ ఆలోచన అలా మొదలైందే. ప్రస్తుతం సోమనాథ్ అధికారికంగా ఇస్రో బాధ్యతల్లో లేనంత మాత్రాన గగన్‌యాన్ మిషన్ ఆగిపోదు. ఒకరు వెళ్లినా మరొకరు వస్తారు. ఇస్రోలో ప్రాజెక్టులు నిరంతరాయంగా సాగుతాయి. రిటైర్ అయిన శాస్త్రవేత్తల అనుభవాన్ని కూడా ప్రభుత్వం నిరంతరం ఉపయోగించుకుంటుంది” అని పేర్కొన్నారు.

స్టార్టప్‌లోకి సోమనాథ్

ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రైవేట్ స్టార్టప్ కంపెనీలో భాగమయ్యారు. అగ్నికుల్ కాస్మోస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్యానెల్‌లో ఆయన అబ్జర్వర్‌‌గా చేరారు. ఈ విషయాన్ని సంస్థ గురువారం ప్రకటించింది. అంతరిక్ష రంగంలో సుదీర్ఘ అనుభవం, ఎన్నో విజయవంతమైన ప్రయోగాలకు నాయకత్వం వహించిన సోమనాథ్ చేరిక తమ సంస్థకు కొండంత బలాన్ని ఇస్తుందని పేర్కొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>