కలం, వెబ్ డెస్క్: ఏపీలోని విద్యార్థుల తల్లిదండ్రులకు గుడ్ న్యూస్ అందుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని ఈ విద్యా సంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు నిధులు విడుదల చేసేందులు చర్యలు వేగవంతం చేశారు. ఎలాంటి జాప్యం లేకుండా పారదర్శకంగా నిధులు విడుదల చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ పథకం అమలులో స్కూళ్ళు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. అర్హుల గుర్తింపు, లబ్ధిదారుల వివరాల ధృవీకరణ, ఆర్థికసా యం విడుదల వంటి ప్రక్రియలను వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
రాష్ట్రంలోని ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న అర్హులైన విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,120.78 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్న ఈ స్కీమ్ తో 67,47,190 మంది పేద విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. మొత్తం 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జామకానున్నాయి. ఈనెల 22 నుంచి తొలివిడతగా 64,76,590 మంది విద్యార్థులకు ఆర్థిక సాయం విడుదల చేస్తారు. అదే రోజున అర్హులు, అనర్హుల జాబితాను గ్రామ వార్డు,సచివాలయాల్లో ప్రచురిస్తారు. ఈ జాబితాలపై జులై 22 నుంచి ఆగస్టు 3 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 4 నుంచి 10 వ తేదీ వరకు అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అదనపు అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు.
ఇక 1వ తరగతి, 9వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం చేరే కొత్త అడ్మిషన్ల కోసం ఆగస్టు 25 వరకు అవకాశం కల్పించారు. వీటన్నింటినీ పరిశీలించి ఆగస్టు 30న అదనపు అర్హుల తుది జాబితాను రిలీజ్ చేస్తారు. అదే రోజున ఆ అదనపు అర్హులకు అందరికీ ఆర్థిక సాయాన్ని జమ చేస్తారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.

