వరంగల్‌లో నకిలీ కార్ గిఫ్ట్ కాంటెస్ట్ గుట్టురట్టు

కలం, వరంగల్: వరంగల్ నగరంలో కారును బహుమతిగా ఇస్తామని చెప్పి లాటరీ పేరుతో అమాయక ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్న “వేంకటేశ్వర కార్ గిఫ్ట్ కాంటెస్ట్”పై వరంగల్ పోలీస్ (Warangal Police) కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడిలో బ్రీజా కారు, వేలాది లాటరీ స్లిప్పులు, మొబైల్ ఫోన్లు, నగదును స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.

వరంగల్ ఉర్సుగుట్ట ప్రాంతంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా లాటరీ పద్ధతిలో కార్లను బహుమతిగా ఇస్తామని ప్రచారం చేస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. పోలీస్ కమిషనర్ శ్వేతా రెడ్డి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్ బృందం దాడులు చేపట్టింది. తనిఖీల్లో సుమారు రూ.4.70 లక్షల విలువైన బ్రీజా కారు (TS03EQ4101), 34 లాటరీ రికార్డు పుస్తకాలు, 5,753 లాటరీ స్లిప్పులు (ఒక్కోటి రూ.200 చొప్పున మొత్తం సుమారు రూ.11.50 లక్షల విలువ), 6 స్మార్ట్ ఫోన్లు, రూ.53,500 నగదు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల విచారణలో పూజారి సుమన్, సముద్రాల రాకేష్, కర్జుగట్ట సురేష్ కలిసి “వేంకటేశ్వర కార్ గిఫ్ట్స్” పేరుతో ఈ లాటరీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా లాటరీలు నిర్వహించి ప్రజలను ఆకర్షిస్తూ భారీ మొత్తంలో నగదు వసూలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులతో పాటు నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. పోలీసులు ప్రజలకు హెచ్చరిక చేస్తూ, లాటరీలు, గిఫ్ట్ కాంటెస్టులు, భారీ బహుమతుల పేరుతో నిర్వహించే అక్రమ పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ అనుమతి లేని లాటరీల్లో పాల్గొని మోసపోవద్దని సూచించారు. ఈ దాడిలో టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కె. శ్రీధర్, ఎస్‌ఐ వీరస్వామి మరియు టాస్క్‌ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>