కలం, వెబ్ డెస్క్ : తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డ్యాన్సర్స్ అసోసియేషన్ (Tollywood Dancers Association) చుట్టూ ముదురుతున్న వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (TFIEF) కాసేపట్లో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది. కొద్ది రోజులుగా డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలు, అంతర్గత విభేదాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ముఖ్యంగా అసోసియేషన్ నిబంధనల ఉల్లంఘనలు, సభ్యుల మధ్య తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఫెడరేషన్ క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఇటీవల అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయడం, 10 మందికి పైగా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు సమర్పించడంతో ఈ గొడవ మరింత ముదిరింది. ఫెడరేషన్ నిబంధనలను కాదని బై-ఎలక్షన్స్ (ఉప ఎన్నికలు) నిర్వహించేందుకు ప్రస్తుత కమిటీ సిద్ధమవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న ఫెడరేషన్ పెద్దలు, దీనిపై ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుత డ్యాన్సర్స్ అసోసియేషన్ భవిష్యత్తు, ఈ కమిటీ కొనసాగింపుపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాజీనామాలు, అంతర్గత కుమ్ములాటలు, ఆర్థిక ఆరోపణలపై సమగ్రంగా సమీక్షించిన అనంతరం, ఫెడరేషన్ తరఫున ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Read Also: ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్.. సంగారెడ్డిలో అడవి అందాల ‘త్రివేణి వనం’!
Follow Us On: X(Twitter)

