కాక రేపుతోన్న వరంగల్ రాజకీయాలు.. హాట్ టాపిక్‌గా మంత్రి ‘చిన్నపులి’ కామెంట్స్!

కలం, వరంగల్ బ్యూరో : “కొండా మురళి పెద్దపులి.. నవీన్ రాజ్ చిన్నపులి” అని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వరంగల్ (Warangal) తూర్పు నియోజకవర్గంలో రాజకీయంగా విస్తృత చర్చకు దారితీశాయి. ఒకవైపు కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలపై చర్చ సాగుతుండగా, మరోవైపు కొండ మురళి ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ ను ఉద్దేశించి చిన్నపులి అంటూ మంత్రి చేసిన కామెంట్స్, అతని రాజకీయ ప్రవేశంపై సంకేతాలు ఇచ్చారనే విశ్లేషణలు నడుస్తున్నాయి.

కొండా దంపతులకు ప్రత్యేక ప్రాధాన్యం

ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కొండా దంపతులకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వరంగల్ తూర్పు సెగ్మెంట్ లో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సురేఖకు మంత్రి పదవి దక్కడంతో బిజీ అయ్యారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు, కార్యకర్తల బాగోగులను ఆమె భర్త మురళి చూస్తున్నారు. ఆయన అనారోగ్య కారణాలతో ప్రధాన అనుచరుడు నవీన్ రాజ్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. పార్టీ కార్యక్రమాలు, నేతలతో సమన్వయం, స్థానిక సమస్యల పరిష్కారం వంటి విషయాల్లో చురుగ్గా ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. దీంతో కొండా దంపతుల తర్వాత నవీన్ రాజ్ పార్టీలో కీలక నేతగా ఎదుగుతున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

అయితే ఇదే అంశం పార్టీలోని కొందరు సీనియర్ నేతల అసంతృప్తికి కారణమైందనే చర్చ కూడా చాలాకాలంగా ఉంది. పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేసిన నేతలను పక్కనబెట్టి, కీలక నిర్ణయాలు నవీన్ రాజ్ ద్వారా జరుగుతున్నాయనే అభ్యంతరాలు కూడా వ్యక్తమవుతున్నట్టు ప్రచారంలో ఉంది. తూర్పు నియోజకవర్గ పార్టీ వ్యవహారాలన్నీ కొండ అనుచరుడి చుట్టూనే తిరుగుతున్నాయనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు గతంలో అతని పేరు పలు వివాదాల్లోనూ వినిపించగా.. అతనిపై రౌడీషీట్ కేసులు నమోదయ్యాయనే ప్రచారమూ ఉంది. భూ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. ఆయనకు ప్రభుత్వం కల్పించిన ఇద్దరు గన్‌మెన్లను పోలీసు శాఖ కూడా ఉపసంహరించుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

సొంత పార్టీ నేతలతో వైరం

సొంత పార్టీ నేతలతోనే కొండా దంపతులు వైరం పెట్టుకోవడంపై రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరిగింది. కొద్దిరోజుల కింద పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో తీవ్ర రాజకీయ విభేదాలు చోటు చేసుకోగా.. పరస్పర విమర్శలు కాస్త తారాస్థాయికి చేరగా చివరకు అధిష్ఠానం జోక్యం చేసుకోగా తాత్కాలికంగా సద్దుమణిగింది.
అయితే వీరి మధ్య వర్గపోరు పూర్తిగా ముగిసిందా..! అనే సందేహాలు ఇంకా తొలగిపోలేదు. ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యకు కొండా దంపతులకు మధ్య కోల్డ్ వార్ నెలకొంది. దీంతో తూర్పున పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయిందని విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికే అధిష్టానం రాబోయే గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అయితే.. కొండా దంపతులు అప్పుడప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మంత్రి సురేఖ ఇటీవల స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లో చేరిన ఆయన ప్రజలకు నైతికంగా సమాధానం చెప్పాలంటే, పదవికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని ఆమె సవాల్ విసిరారు.

అంతేకాకుండా బీఆర్ఎస్ హయాంలో ఉప ముఖ్యమంత్రిగా శ్రీహరి ఉండగా.. అదే పార్టీలో ఉన్న కొండా దంపతులతోనూ వైరం నడిచింది. అనంతరం కొండా దంపతులు కాంగ్రెస్ లో చేరారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేగా కడియం శ్రీహరి గెలుపొందగా కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్నారు. తన కూతురు కావ్యను కాంగ్రెస్ నుంచి వరంగల్ ఎంపీ గా గెలిపించుకున్నారు. వీరి మధ్య కూడా కోల్డ్ వార్ నడుస్తున్నట్లు పార్టీ వర్గాల్లోనూ చర్చ నడుస్తుంది.
ఇప్పుడు మంత్రి కొండా సురేఖ తమ అనుచరుడు నవీన్ రాజ్‌ను ‘చిన్న పులి’గా అభివర్ణించడం మరింత ఆసక్తిని రేకెత్తించింది.

ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా వ్యాఖ్యలు

మంత్రి సురేఖ తాజా వ్యాఖ్యలు కేవలం ప్రశంస మాత్రమే కాకుండా అనుచరుడికి మరింత రాజకీయ ప్రాధాన్యం ఉందనే సంకేతంగా కూడా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తూర్పు నియోజకవర్గంలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యాఖ్యలు వచ్చాయా అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే కాంగ్రెస్‌లోని మరో వర్గం మాత్రం పార్టీలో వ్యక్తుల కంటే సంస్థాగత వ్యవస్థకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఒక్క నేత చుట్టూ వ్యవహారాలు కేంద్రీకృతం కావడం మంచిది కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

ఇదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు కూడా కొండా దంపతుల వ్యాఖ్యలను రాజకీయ అస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మొత్తంగా చూస్తే, కడియం శ్రీహరిపై చేసిన సవాల్, రేవూరి ప్రకాశ్ రెడ్డితో జరిగిన విభేదాలు, ఇప్పుడు నవీన్ రాజ్‌పై చేసిన చిన్నపులి వ్యాఖ్యల పరిణామాలు వరుసగా చోటుచేసుకోవడంతో వరంగల్ తూర్పు రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌లోనూ, ప్రతిపక్షాల్లోనూ ఎలాంటి రాజకీయ ప్రతిస్పందనలు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>