కలం, యాదగిరిగుట్ట: ఆలేరు నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.224 కోట్లతో పెండింగ్‌లో ఉన్న రహదారి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) తెలిపారు. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పథకం కింద బీటీ రోడ్ల అభివృద్ధి పనులకు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లిలో రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు..
ఈ సందర్భంగా నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని విప్ బీర్ల అయిలయ్య పిలుపునిచ్చారు. శనివారం యాదగిరిగుట్ట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుల వివరాలను వెల్లడించారు. ఇదే వేదికపై, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నియమించిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఛైర్మన్లు, డైరెక్టర్లను మంత్రుల సమక్షంలో సన్మానించనున్నట్లు తెలిపారు.
రోడ్ల నిర్మాణం పూర్తయితే..
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల అనుసంధానానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రోడ్ల నిర్మాణం పూర్తయితే ప్రజలకు సురక్షితమైన, వేగవంతమైన రవాణా సౌకర్యం అందుతుందని, ప్రధానంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్లకు సులభంగా తరలించడానికి, ఈ ప్రాంతంలో వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడానికి ఈ ప్రాజెక్టులు ఎంతో కీలకం కానున్నాయని తెలిపారు.

