కలం, జోగుళాంబ గద్వాల: పేదలకు మెరుగైన వైద్యం అందించాల్సిన గద్వాల (Gadwal) జిల్లా ప్రభుత్వ దవాఖానా నిర్వహణ లోపాలతో కొట్టుమిట్టాడుతోంది. మూడు రోజులుగా స్కానింగ్ సెంటర్ సేవలు నిలిచిపోయాయి. రేడియాలజిస్ట్‌లు రోగులను ‘రేపు రండి..’ అంటూ పంపించేస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో..
గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఆసుపత్రిలోని ‘రేడియాలజీ హబ్’లో ఉదయం నుంచి కరెంట్ లేక ఎక్స్-రే, స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దీంతో జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పరీక్షల కోసం వచ్చిన రోగులు, వారి కుటుంబ సభ్యులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి.
జనరేటర్ ఉన్నా..
అత్యవసర వైద్య సేవల కోసం ఆసుపత్రిలో జనరేటర్ అందుబాటులో ఉన్నా.. అధికారులు, సిబ్బంది ఆన్ చేయడం లేదని రోగులు, వారి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లగా సమాధానం దాటవేశారు. ఇప్పటికైనా స్కానింగ్ సెంటర్లు నిరాటంకంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

