రాష్ట్రంలో ఇదే పెద్ద సమస్య: సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్: రైతాంగానికి నీరు అందించడమే పెద్ద సమస్యగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. వ్యవసాయంలో ఇబ్బందులు తమకు కూడా తెలుసని.. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతలు తమ రక్తాన్ని చిందించి పంటలు పండించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జూన్‌లోనే కేంద్రం రిపోర్ట్..

కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం 2026, జూన్ 26న మూడు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం ఇచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పూర్తిగా నిపుణుల సలహాలు, సూచనలతోనే పునర్నిర్మించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అందుకోసం ప్రభుత్వం అహర్నిశలు ప్రయత్నిస్తోందన్నారు.

కిలాడీ కమిటీ.. NDSA కమిటీ

కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుపై రెండు కమిటీలున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటిలో కేసీఆర్, హరీశ్, కేటీఆర్, ఈటల ఆధ్వర్యంలోని కిలాడీ కమిటీ, సాంకేతిక నిపుణులతో కూడిన NDSA కమిటీ ఉందన్నారు. తాము కిలాడీ కమిటీని పట్టించుకోమని.. NDSA కమిటీనే ప్రామాణికంగా తీసుకుంటామన్నారు.

రిటైర్డ్ ఇంజినీర్లపై ఆగ్రహం..

కన్నెపల్లి పంప్ హౌస్ (Kannepalli Pump House) నుంచి ఎత్తిపోతలు ప్రారంభించాలన్న రిటైర్డ్ ఇంజినీర్ల ప్రతిపాదనపై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. వేమనపల్లి వద్ద ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పింది కూడా వీళ్లేనని.. శ్యామ్ ప్రసాద్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు. వీరిని జైళ్లకు పంపకుండా విడిచిపెట్టి తప్పు చేశానంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

పార్లమెంటులో లేవనెత్తుతాం..

కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణను సీబీఐకి అప్పగించామని.. దాని గురించి అడుగుతుంటే తప్పించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని ప్రధాని మోదీ, అమిత్ షా పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. మరి ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడం లేదో.. అడగాలని ఎంపీ ఈటల రాజేందర్ కు సూచించారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే అంశంపై కేంద్రాన్ని గట్టిగా నిలదీస్తామని హెచ్చరించారు.

Read Also: ప్రముఖ గాయని ఎస్. జానకి కన్నుమూత

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>