కలం, ధర్మపురి: ధర్మపురి (Dharmapuri) మండలంలోని నక్కలపేట్, దోనూర్, తీగలధర్మారం గ్రామాల్లో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) సుడిగాలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి ఆయా గ్రామాల్లో సాగునీటి పరిస్థితులను పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సాగునీరు సకాలంలో అందేలా కెనాల్లను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి, అవసరమైన మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.
అనంతరం తీగలధర్మారం గ్రామంలో లబ్ధిదారురాలు నూతనమ్మ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయడమే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి నాణ్యమైన గృహాలు అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

