కలం మెదక్ బ్యూరో : నిరుపేద దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో దశాబ్దాల కింద ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం (Best Available Scheme) ఉమ్మడి మెదక్ జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ప్రభుత్వ నిధులు మూడేళ్లుగా విడుదల కాకపోవడం, ఈ-పాస్ పోర్టల్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పథకం అమలులో జాప్యం నెలకొంది. దీంతో వేలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం సుమారు 1,500 మంది ఎస్సీ, 500 మందికి పైగా ఎస్టీ విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
పెండింగ్ బకాయిలు
గత మూడు విద్యా సంవత్సరాలుగా ప్రభుత్వం నుంచి పాఠశాలలకు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సిద్దిపేట జిల్లాలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు మాత్రమే ప్రభుత్వం నుంచి సుమారు రూ.1.40 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని యాజమాన్యం చెబుతోంది. ఇక ఈ-పాస్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు కూడా పథకం అమలుకు ఆటంకంగా మారాయి. గత కొన్నేళ్లుగా నిర్దేశిత కోటా కంటే ఎక్కువ మంది విద్యార్థులను చేర్చుకోవడంతో, అదనపు విద్యార్థుల వివరాలను పోర్టల్‌లో నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రభుత్వ నిధులు వచ్చే అవకాశాలు కూడా సందిగ్ధంగా మారాయి.
ఆందోళనలో తల్లిదండ్రులు
నిధుల కొరత కారణంగా పలు ప్రైవేట్ పాఠశాలలు కొత్త అడ్మిషన్లను నిలిపివేయడంతో పాటు, ఇప్పటికే చదువుతున్న విద్యార్థుల విషయంలో కూడా అనిశ్చితి నెలకొంది. కొంతమంది యాజమాన్యాలు తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించాలని, లేదంటే ఇతర పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని సూచిస్తున్నట్లు సమాచారం. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఇటీవల మెదక్ కలెక్టర్ ప్రతిమా సింగ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. పాఠశాలలు తమ పిల్లలను తరగతులకు అనుమతించడం లేదని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరారు.
పథకం లక్ష్యం ఇదే..
ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. కలెక్టర్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో విద్యార్థులు ప్రవేశాలు పొందుతారు. పథకంలో భాగంగా విద్యార్థుల ట్యూషన్ ఫీజులు, వసతి, భోజన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది. దీనిద్వారా ఎస్సీ విద్యార్థులకు 1, 5, ఎస్టీ విద్యార్థులకు 1, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ప్రాథమిక తరగతుల విద్యార్థికి ఏడాదికి రూ.28 వేలు, వసతితో కూడిన ప్రాథమికోన్నత విద్యార్థికి రూ.42 వేలు ప్రభుత్వం చెల్లిస్తుంది.
బకాయిలు చెల్లిస్తేనే అడ్మిషన్లు
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు మాత్రం ప్రభుత్వ బకాయిలు చెల్లించకుండా కొత్త అడ్మిషన్లు తీసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి. మూడేళ్లుగా నిధులు రాకపోయినా ఇప్పటికే చేరిన విద్యార్థులను కొనసాగిస్తున్నామని, ఫీజులు, హాస్టల్ చార్జీలు చెల్లించకపోవడంతో ఆర్థిక భారం పెరుగుతోందని పేర్కొంటున్నాయి. ఈ సమస్యపై పాఠశాలల ప్రతినిధులు మెదక్ జిల్లా కలెక్టర్‌ను కలిసి బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. మరోవైపు దళిత సంఘాలు కూడా మంత్రి వివేక్‌కు వినతిపత్రం అందజేసి, బీఏఎస్ పథకాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశాయి.
ప్రభుత్వ జోక్యం అవసరం
ఒకవైపు విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళనలు.. మరోవైపు బకాయిల కోసం ప్రైవేట్ పాఠశాలల పోరాటం కొనసాగుతున్న నేపథ్యంలో, నిరుపేద దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే బీఏఎస్ పథకం లక్ష్యం దెబ్బతింటోంది. సమస్య మరింత తీవ్రం కాకముందే ప్రభుత్వం జోక్యం చేసుకుని పెండింగ్ బకాయిలు విడుదల చేయడంతో పాటు అడ్మిషన్ ప్రక్రియను సజావుగా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

