కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు, రైతాంగానికి వెన్నెముకగా నిలవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (PACS) రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పీఏసీఎస్ (PACS Nalgonda) ల్లో నామినేటెడ్ పదవుల జోష్ కనిపిస్తోంది. చైర్మన్లు, డైరెక్టర్ల నియామకాలతో అధికార పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. పీఏసీఎస్‌ల్లో నామినేటెడ్ పద్ధతిన నియామకాలు తీసుకురావడంతో స్థానిక ఎమ్మెల్యేల ఎంపికే ఫైనల్ అవుతోంది.
అయితే.. ఇలా చేయడం క్షేత్రస్థాయిలో అన్నదాతలకు అన్యాయం జరుగుతుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 107 సొసైటీలు (నల్లగొండ 42, సూర్యాపేట 44, యాదాద్రి 21 సంఘాలు) ఉన్నాయి. ఇప్పటికే యాదాద్రి జిల్లాలో 10 పీఏసీఎస్ లకు పాలక మండళ్ల నియామకం పూర్తయింది. ఒకట్రెండు రోజుల్లో మిగిలినవి పూర్తవుతాయి. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో దాదాపు అన్ని సంఘాలకు పాలకమండళ్లు ఖరారైనప్పటికీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
గత ప్రభుత్వంలో నిర్వీర్యం
గతంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలకు (AMC) మాత్రమే నామినేటెడ్ పద్ధతి ఉండేది. పీఏసీఎస్‌లకు ఎన్నికలు జరిగేవి. సంఘంలో సభ్యత్వం ఉన్న రైతులు స్వయంగా ఓటు వేసి డైరెక్టర్లను ఎన్నుకుంటే.. వారిలో ఒకరిని చైర్మన్‌గా ఎన్నుకునే విధానం ఉండేది. ఇప్పుడు నామినేటెడ్ విధానంతో రైతులు తమ ప్రతినిధిని ఎన్నుకునే హక్కు లేకుండా పోయింది. కేవలం ‘పీఏసీఎస్‌లో సభ్యత్వం ఉంటే చాలు.. మరే అర్హత అక్కర్లేదు’ అనే నిబంధనను ఆసరాగా చేసుకుని, ఎమ్మెల్యేలు తమ అనుచరులకు పదవులను కట్టబెడుతున్నారు.
దీంతో అన్నదాతల కష్టాలు తెలిసిన వారికి చాన్స్ లేకుండాపోతోంది. ఒకప్పుడు రైతులకు అవసరమైన రుణాలు, సబ్సిడీ యంత్రాలు, విత్తనాలు సరఫరా చేయడంలో పీఏసీఎస్ లు కీలకపాత్ర పోషించాయి. గత ప్రభుత్వ హయాంలో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. నేడు ఉత్సవ విగ్రహాలుగా మిగిలాయి. డిజిటల్ యాప్‌లు, ప్రైవేట్ ఫర్టిలైజర్ షాపుల్లో నేరుగా విక్రయాలు జరుగుతుండడంతో పీఏసీఎస్ (PACS Nalgonda)ల ప్రాధాన్యం, కోటా క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం పీఏసీఎస్‌లు కేవలం సీజన్‌లో జరిగే ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణకు మాత్రమే పరిమితమయ్యాయి. రైతులకు ఇవ్వాల్సిన పంట రుణాలు సైతం నామమాత్రంగానే అందుతున్నాయి.
రాజకీయ కేంద్రాలుగా..
ప్రస్తుతం వ్యవసాయ రంగం సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి, లాభసాటి వినూత్న పంటల వైపు రైతులను నడిపించడంలో పీఏసీఎస్ లు మార్గదర్శిగా నిలవాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడంలో ఇవి కీలక పాత్ర పోషించాలి. కానీ, దురదృష్టవశాత్తూ పాలక ప్రభుత్వాలు వీటిని బలోపేతం చేయడం పక్కనబెట్టాయి. కేవలం రాజకీయ లబ్ధి, సొంత పార్టీ నేతలను సర్దుబాటు చేసే రాజకీయ కేంద్రాలుగా మార్చేశాయి.
ఎన్నికల పద్ధతిలో నిర్వహించాలి : బండా శ్రీశైలం, రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు
పీఏసీఎస్ (PACS Nalgonda)ల పాలకమండలి ఎంపిక పరోక్ష పద్ధతి కాకుండా ప్రత్యక్షంగా ఎన్నికలు ద్వారా జరపాలి. రైతులతో ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే అవకాశం కల్పించాలి. నామినేటెడ్ గా రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులను ఎన్నుకునేలా ఉండాలి. ఎమ్మెల్యేల నామినేటెడ్ పద్ధతిని ఉప ఉపసంహరించుకోవాలి. సంఘాల్లో రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి. రైతు సమస్యల పట్ల అవగాహన లేని వారికి చైర్మన్లు, డైరెక్టర్లుగా పరోక్ష పద్ధతిలో నియమించడం సరైన పద్ధతి కాదు.

