Mobile Popup Ad
Mobile Popup Ad

ఎంబాప్పేపై జాత్యహంకార వ్యాఖ్యలు.. ఫిఫా తీవ్ర ఖండన

కలం, స్పోర్ట్స్: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ కిలియన్ ఎంబాప్పే (Kylian Mbappe)పై పరాగ్వే సెనేటర్ చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనపై ఫిఫా అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ఘాటుగా స్పందించగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, పరాగ్వే ప్రభుత్వం కూడా ఆ వ్యాఖ్యలను ఖండించాయి. పరాగ్వే సెనేటర్ సెలెస్టే అమరిల్లా ఎంబాప్పేపై వ్యక్తిగతంగా, జాత్యహంకార ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. ఫ్రాన్స్ జట్టు అదృష్టం వల్లే గెలిచిందని, మ్యాచ్ మొత్తం ఎంబాప్పే భయంతో కనిపించాడని కూడా ఆమె ఆరోపించారు.

ఈ వ్యాఖ్యలపై ఎంబాప్పే తీవ్రంగా స్పందించారు. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తి తన పదవికి తగినవారు కాదని ఆయన వ్యాఖ్యానించారు. వివాదం మరింత ముదరడంతో ఫిఫా (FIFA) అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో తన సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఒక్కటిగా కలిపే ఆట అని, అందులో కానీ సమాజంలో కానీ జాత్యహంకారానికి ఎలాంటి స్థానం లేదని స్పష్టం చేశారు. ఎంబాప్పేపై చేసిన వ్యాఖ్యలను తాను పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం ఫ్రాన్స్ కెప్టెన్‌కు అండగా నిలుస్తోందని, జాత్యహంకారాన్ని అందరం కలిసి ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ కూడా ఎంబాప్పేకు మద్దతుగా నిలిచారు. మైదానంలోనే కాదు, జాత్యహంకారానికి వ్యతిరేకంగా కూడా మరో గోల్ సాధించారని పేర్కొన్నారు. గౌరవం, పరస్పర మర్యాద, సోదరభావమే తమ విలువలని గుర్తు చేశారు. ఈ వివాదంపై పరాగ్వే ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది.

సెనేటర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అవి మానవ గౌరవం, శాంతియుత సహజీవనం వంటి దేశం పాటించే విలువలకు విరుద్ధమని తెలిపింది. అలాగే ఆ వ్యాఖ్యలు పూర్తిగా సెనేటర్ వ్యక్తిగత అభిప్రాయాలేనని స్పష్టం చేసింది. అవి పరాగ్వే ప్రభుత్వానివి గానీ, అక్కడి ప్రజల అభిప్రాయాన్ని గానీ ప్రతిబింబించవని వెల్లడించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>