కలం, స్పోర్ట్స్: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఫోలారిన్ బాలోగన్ (Folarin Balogun) వ్యవహారం పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా స్టార్ స్ట్రైకర్పై విధించిన ఒక మ్యాచ్ ఆటోమేటిక్ నిషేధాన్ని ఫిఫా నిలిపివేయడంతో టోర్నీలో కొత్త వివాదం మొదలైంది. ఈ నిర్ణయాన్ని అమెరికా స్వాగతించగా, బెల్జియం, ఇంగ్లండ్, నార్వే తీవ్రంగా ప్రశ్నించాయి. అమెరికా తరఫున మూడు గోల్స్ చేసిన బాలోగన్, బోస్నియా-హెర్జెగోవినాతో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి ఆటగాడు తారిక్ ముహరెమోవిచ్ కాలి మడమపై తగలడంతో నేరుగా రెడ్ కార్డు చూశాడు.
దీంతో అతనికి ఒక మ్యాచ్ నిషేధం పడింది. అయితే తర్వాత ఫిఫా జోక్యం చేసుకుని ఆ నిషేధాన్ని నిలిపివేసింది. దీంతో బెల్జియంతో జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్కు అతను అందుబాటులోకి వచ్చాడు. ఈ నిర్ణయం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. జరిగిన అన్యాయాన్ని సరిచేసినందుకు ఫిఫాకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై బెల్జియం ఫుట్బాల్ సమాఖ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రపంచకప్ చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఇదే తొలిసారి అని పేర్కొంది.
ఫుట్బాల్లో న్యాయం, సమానత్వాన్ని కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది. బెల్జియం కోచ్ రూడి గార్సియా కూడా ఈ నిర్ణయంపై వ్యంగ్యంగా స్పందించారు. ఫిఫా ఈ ప్రకటన చేసిన సమయం ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఇంగ్లండ్ కోచ్ థామస్ టుచెల్ కూడా ఈ నిర్ణయంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు కొనసాగితే భవిష్యత్తులో ప్రతి రెడ్ కార్డుపై చర్చ మొదలవుతుందని చెప్పారు.
నార్వే కోచ్ స్టాలే సోల్బాకెన్ మరింత ఘాటుగా స్పందించారు. ఇకపై ప్రతి రెడ్ కార్డును కూడా ఇలాగే సమీక్షిస్తారా అనే సందేహం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం ప్రపంచకప్ ప్రతిష్ఠకు నష్టం కలిగించే అవకాశముందని అభిప్రాయపడ్డారు. ఫుట్బాల్ దిగ్గజాలు గ్యారీ నెవిల్, వేన్ రూనీ, మికా రిచర్డ్స్, థియెరీ హెన్రీ కూడా ఫిఫా నిర్ణయాన్ని విమర్శించారు. నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలని, ఇలాంటి నిర్ణయాలు టోర్నీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతాయని అభిప్రాయపడ్డారు.
మరోవైపు అమెరికా కోచ్ మౌరిసియో పోచెట్టినో మాత్రం ఫిఫా నిర్ణయాన్ని సమర్థించారు. బోస్నియా మ్యాచ్లో తమ జట్టు ఇప్పటికే 30 నిమిషాలు 10 మంది ఆటగాళ్లతో ఆడాల్సి వచ్చిందని, అదే సరిపడా శిక్ష అని అన్నారు. ట్రంప్ ఈ విషయంలో ఆసక్తి చూపడం కూడా స్వాగతించదగ్గ విషయమేనని చెప్పారు. ఫిఫా తన క్రమశిక్షణ నియమావళిలోని ఆర్టికల్ 27 ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆ నిబంధన ప్రకారం కొన్ని సందర్భాల్లో శిక్ష అమలును తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందని వివరించింది.
బాలోగన్పై (Folarin Balogun) విధించిన నిషేధాన్ని ఒక సంవత్సరం పరీక్షా కాలానికి వాయిదా వేసినట్లు వెల్లడించింది. ఈ కాలంలో మళ్లీ ఇలాంటి తప్పిదం చేస్తే ప్రస్తుత నిషేధంతో పాటు కొత్త శిక్ష కూడా అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో బాలోగన్ బెల్జియంతో జరిగే కీలక మ్యాచ్లో ఆడనున్నాడు. అయితే ఫిఫా తీసుకున్న ఈ నిర్ణయంపై చర్చలు, విమర్శలు కొనసాగుతున్నాయి.

