కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టరేట్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులతో కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agarwal) మాట్లాడుతూ.. 25వ తేదీ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. జిల్లాలో 549 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 55 మంది బీఎల్వో సూపర్ వైజర్లు, 549 మంది బీఎల్ఓలు ఉన్నారని వెల్లడించారు. మొత్తం 4,75,694 మంది ఓటర్లు ఉండగా వీరిలో 2,28,579 మంది పురుషులు, 2,47,072 మంది మహిళలు, 43 మంది ట్రాన్స్ జెండర్స్ ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు 4,04,414 మంది మ్యాపింగ్ పూర్తయిందని, ఇంకా 71,280 మంది ఇంకా మ్యాపింగ్ చేయాల్సి ఉందని తెలిపారు.
25 నుంచి ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ..
ఓటర్ జాబితాలో ఉన్న ఓటకు బీఎల్ఓలు ఈ నెల 25 వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఇంటింటికీ వచ్చి ఎన్యూమరేషన్ ఫారాలు ఇస్తారని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు. వారికి ఓటర్లు పూర్తి వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాన్ని సమర్పించాలని, ప్రస్తుత పాస్ పోర్ట్ సైజ్ ఫొటో తప్పనిసరిగా జులై 31వ తేదీలోగా అందజేసి.. రసీదు తీసుకోవాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్ బీఎల్‌వో ఎవరో ప్రజలకు తెలిసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఫారాలు నింపడంలో ఓటర్లకు కచ్చితంగా సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఫారాలతో పాటు ఎలాంటి గుర్తింపు కార్డుల జిరాక్స్ పత్రాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, గుర్తింపు కార్డు వివరాలు బీఎల్ఓలకు ఇవ్వాలని సూచించారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ జులై 31వ తేదీన పబ్లిష్ అవుతుందని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30వ తేదీలోగా సమర్పించాలని సూచించారు.
మ్యాపింగ్ కాకపోతే నోటీసులు జారీ..
డ్రాఫ్ట్ జాబితా విడుదలైన తర్వాత మ్యాపింగ్ సరిగా కాకపోతే ఎన్నికల అధికారులు సంబంధిత వారికి నోటీసులు జారీ చేస్తారని కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ఆ సమయంలో పౌరసత్వ నిబంధనల ప్రకారం పుట్టిన సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని అవసరమైన పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. సెప్టెంబర్ 28 నాటికి అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించి, అక్టోబర్ 1న తుది ఎస్‌ఐఆర్ ఓటరు జాబితాను విడుదల చేస్తామని తెలిపారు. అక్టోబర్ 1, 2026ను ప్రామాణిక తేదీగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే సర్ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఒక్కో ఇంటికి మూడు సార్లు..
ఇల్లు తాళం వేసి ఉన్నా కంగారు పడొద్దని.. బీఎల్‌వోలు మూడు సార్లు సందర్శిస్తారని కలెక్టర్ చెప్పారు. ఓటర్లు voter.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా ఎన్యూమరేషన్ ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని పూరించవచ్చని తెలిపారు. డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు లేకపోతే ఫారం-6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి రాజకీయ పార్టీ బూత్ స్థాయిలో బీఎల్‌ఏలను నియమించి.. వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని సూచించారు.
ఒక్క అర్హుడైన ఓటరు ఓటు హక్కు కోల్పోకుండా, అర్హులైన ఓటరు ఒకే చోట ఓటు హక్కు కలిగి ఉండాలనేది ఎన్నికల సంఘం లక్ష్యమని స్పష్టం చేశారు. ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగి ఉండడం నేరమని తెలిపారు. మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓట్లు, రెండు చోట్ల ఓటు ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కే.ఎస్.బీ కుమారి, ఎన్నికల విభాగం అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Also: నల్లగొండను మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం.. మంత్రి కోమటిరెడ్డి
Follow Us On: X(Twitter)

