కలం వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2027 (IPL 2027) సీజన్‌కు ముందు జరిగిన భారీ ట్రేడ్ అధికారికంగా ఖరారైంది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) తరఫున ఆడిన రిషబ్ పంత్ (Rishabh Pant) మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టులోకి చేరనున్నారు. దీంతో వచ్చే సీజన్‌లో ఆయన జెర్సీ కూడా మారనుంది. ఐపీఎల్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ ట్రేడ్‌ను ధృవీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం పంత్ రూ. 15 కోట్ల జీతంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వెళ్తున్నారు. మరోవైపు కుల్‌దీప్ యాదవ్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను వీడి లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరనున్నారు.
పంత్‌కు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. 2016 నుంచి 2024 వరకు ఆయన ఆ జట్టు తరఫున ఆడారు. ఈ కాలంలో 111 మ్యాచ్‌లు ఆడి ఫ్రాంచైజీ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా నిలిచారు. అలాగే నాలుగు సీజన్ల పాటు జట్టుకు నాయకత్వం వహించారు. 2025 ఐపీఎల్ వేలంలో పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనుగోలు చేసింది. అది అప్పట్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక బిడ్‌గా నమోదైంది. ఇప్పుడు ట్రేడ్ ద్వారా ఆయన మళ్లీ పాత జట్టులోకి చేరుతున్నారు.
కుల్‌దీప్ యాదవ్ కూడా ఢిల్లీ తరఫున కీలక పాత్ర పోషించారు. 2022 నుంచి జట్టులో ఉన్న ఆయన 65 మ్యాచ్‌ల్లో 72 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఉన్న రూ. 13.50 కోట్ల జీతంతోనే లక్నో జట్టులోకి మారనున్నారు. ఇలా రెండు జట్ల మధ్య జరిగిన ఈ కీలక ట్రేడ్ ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందే చర్చనీయాంశంగా మారింది. రాబోయే సీజన్‌లో ఈ మార్పులు జట్ల ప్రదర్శనపై ఎలా ప్రభావం చూపుతాయో ఆసక్తిగా మారింది.

