కలం, తిరుమలగిరి(సాగర్): నల్లగొండ (Nalgonda) జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిరుమలగిరి సాగర్ మండల పరిధిలో సంభవించిన పిడుగుపాటుకు గురై ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తిరుమలగిరి సాగర్ మండలంలోని బోయగూడెం గ్రామానికి చెందిన పుట్టపాక మల్లయ్య (45) అనే రైతు (Farmer) సోమవారం తన పొలం వద్ద గోవులను మేపుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి భారీ వర్షం ప్రారంభమైంది. వర్షం పడుతున్న సమయంలోనే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కూడిన పిడుగు నేరుగా మల్లయ్యపై పడింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.
పొలంలో మల్లయ్య పడి ఉండటాన్ని గమనించిన తోటి రైతులు, కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మల్లయ్య హఠాన్మరణంతో బోయగూడెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

