Mobile Popup Ad
Mobile Popup Ad

భువనగిరి కోటకు పూర్వవైభవం తీసుకొస్తాం: మంత్రి జూపల్లి

కలం, భువనగిరి: పర్యాటక శాఖ అభివృద్ధి పనుల్లో అలసత్వాన్ని, నాణ్యతా లోపాలను సహించేది లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కాంట్రాక్టర్‌ను తీవ్రంగా హెచ్చరించారు. భువనగిరి ఖిల్లా అభివృద్ధి పనులను పరిశీలించిన ఆయన, పనుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పది నెలల క్రితమే భూమిని స్వాధీనం చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి పనులు శూన్యమని మంత్రి మండిపడ్డారు. కాంట్రాక్టర్ పూర్తి అలసత్వం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నాయని, పనుల్లో నాణ్యతా లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో ఐదు నెలలలోపు పనులన్నీ పూర్తి చేయాలని, లేనిచో కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు కాంట్రాక్టర్‌ను బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించారు.

మన కట్టడాలు వందేళ్లయినా చెక్కుచెదరకుండా నిలిచిపోయేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. భువనగిరి కోట ఎంతో చరిత్ర కలిగిన పురాతన కోట అని, దీనికి పూర్వవైభవం తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఫోర్ట్ రిస్టోరేషన్ (పునరుద్ధరణ) పనులు చేపట్టి, ఇక్కడి చరిత్రను ప్రతిబింబించేలా అద్భుతమైన మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం భువనగిరి ఖిల్లాపైకి వెళ్లేందుకు రోప్ వే ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా గంటకు 300 మంది ప్రయాణికులు పైకి చేరుకోవచ్చని తెలిపారు.

యాదగిరిగుట్ట, భువనగిరి ఖిల్లా, కొలనుపాక సోమేశ్వర ఆలయం, స్వర్ణగిరి క్షేత్రాలను కలుపుతూ ఒక ప్రత్యేక ‘టూరిజం సర్క్యూట్’ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వెనుకబడిన పర్యాటక శాఖను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడతామని మంత్రి జూపల్లి (Jupally Krishna Rao) ధీమా వ్యక్తం చేశారు. “దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసి వందలాది మందికి ఉపాధి కల్పిస్తాం” అని పేర్కొన్నారు. “విదేశాల్లో ఐదు రోజులు కష్టపడి పనిచేసి, రెండు రోజులు పర్యటనల (టూర్ల) పేరుతో గడుపుతారు. తెలంగాణ ప్రజలు కూడా నెలకు కనీసం రెండు రోజులైనా పర్యాటక ప్రాంతాల సందర్శనకు సమయం కేటాయించాలి. పర్యాటక స్థలాలకు వెళ్లడం వల్ల మనుషుల్లో ఆలోచనా విధానం మారుతుంది, మానసిక ఉల్లాసం లభిస్తుంది. అలాగే స్థానికంగా ఎంతోమందికి ఉపాధి దొరుకుతుంది, తద్వారా రాష్ట్రానికి ఆదాయం కూడా పెరుగుతుంది.” అని మంత్రి చెప్పుకొచ్చారు. త్వరలోనే ప్రతిఒక్కరూ తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా అన్ని వసతులతో కూడిన ప్రత్యేక ఏర్పాట్లు చేయబోతున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>