Mobile Popup Ad
Mobile Popup Ad

చేతులు తడిపితేనే ‘పట్టా’.. లేదంటే కొర్రీల ‘వేటు’!

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన శంభయ్య (పేరు మార్చాం)కు ముగ్గురు కూతుళ్లు. ఏండ్ల కింద ఒక తెల్లకాగితం (సాదాబైనామా) (Sadabainama)పై ఒప్పందం రాసుకుని రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. నాటి నుంచి ఆ భూమిని సాగు చేసుకుంటున్నప్పటికీ.. అధికారికంగా పట్టా లేకపోవడంతో బ్యాంకు లోన్లు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ రావట్లేదు. ఈ క్రమంలో కూతుళ్ల పెండ్లి ఖర్చుల కోసం నల్లగొండలోని ఒక కీలక ప్రజా ప్రతినిధి వద్ద ఆ తెల్లకాగితాలను తాకట్టు పెట్టాడు. ఆ తర్వాత అప్పు మొత్తం పూర్తిగా తీర్చినా.. సదరు ప్రజా ప్రతినిధి అనుచరుడు కాగితాలు తిరిగి ఇవ్వలేదు. ఇటీవల సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ ప్రారంభమవ్వగానే, ఆ అనుచరుడు తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి శంభయ్య భూమిని తన పేరుపై అక్రమంగా పట్టా చేయించుకోవాలని ప్లాన్ వేశాడు. రెవెన్యూ అధికారులను మభ్యపెట్టి ప్రక్రియను చివరి వరకు తీసుకెళ్లాడు. అయితే, శంభయ్య కూతుళ్లు విషయం తెలుసుకొని తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో ఆ అక్రమ ప్రయత్నం కొంతకాలం ఆగిపోయింది. ఈ పరిస్థితి శంభయ్య ఒక్కడిదే కాదు.. ఇటువంటి బాధితులు రాష్ట్రంలో కోకొల్లలు.

రాష్ట్రంలో సాదాబైనామా (తెల్లకాగితం) భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ అవినీతిమయంగా మారింది. పేద రైతుల భూమి హక్కుల కల్పనలో ప్రభుత్వం ఉచిత అవకాశాలు కల్పిస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా తయారైంది. కాసులు ఇస్తే తప్ప ఫైళ్లు కదలని దుస్థితి నెలకొంది. నిబంధనల పేరుతో అర్హులను వేధించడం, లంచాలు ఇస్తేనే సమ్మతించడం వంటి అధికారుల తీరుతో.. ఈ పథకం రైతు కష్టాలు తీర్చే మార్గంగా కాకుండా.. కొందరు రెవెన్యూ సిబ్బంది జేబులు నింపే చిరునామాగా మారింది.

అప్పట్లో అవగాహన లేక..

గతంలో గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై సరైన అవగాహన లేకపోవడం వల్ల కేవలం తెల్లకాగితం (సాదాబైనామా)పై ఒప్పందాలు రాసుకుని భూములు కొనుగోలు చేసేవారు. ఏండ్లుగా ఆ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వ రెవెన్యూ రికార్డుల్లో (పహాణీల్లో) మాత్రం వారి పేర్లు నమోదు కాలేదు. గతంలో భూమి అమ్మినవారు, కొన్నవారు ఇద్దరి అఫిడవిట్లు తప్పనిసరి అనే నిబంధన ఉండటంతో దరఖాస్తులు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి జీవో 76, 77 ద్వారా అమ్మినవారి అఫిడవిట్ నిబంధనను తొలగించి, కేవలం కొనుగోలుదారుడి అఫిడవిట్ సరిపోతుందని ప్రకటించింది.

ఏండ్లుగా ప్రభుత్వ ఫలాలకు దూరం

తరతరాలుగా భూములు సాగు చేస్తున్నప్పటికీ అధికారికంగా పట్టాదార్ పాస్ పుస్తకం లేకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ప్రభుత్వం అందించే రైతు భరోసా, పంట బీమా, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, రుణమాఫీ వంటి పథకాలు ఏవీ వీరికి వర్తించడం లేదు. బ్యాంకు రుణాలు పొందాలన్నా సాదాబైనామా రైతులకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూస్తున్న ఈ సమస్య తీరే తరుణంలో అధికారుల అవినీతి వేధింపులు రైతులకు శాపంగా మారాయి.

చేతులు తడిపితేనే పట్టా..

నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు 82,134 దరఖాస్తులు పెండింగ్ లో ఉండగా, గత కొన్ని రోజులుగా వీటికి సంబంధించిన క్షేత్రస్థాయి పరిశీలన, నోటీసుల జారీ ప్రక్రియ నడుస్తున్నది. అయితే, ఈ సడలింపులే కొందరు క్షేత్రస్థాయి అధికారులకు దోపిడీ మార్గంగా మారాయి. సాదాబైనామా భూమిని క్రమబద్ధీకరించి 13(బి) సర్టిఫికెట్ జారీ చేయాలంటే.. ఎకరాకు లేదా గుంటకు లెక్కగట్టి వేలల్లో లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘కాసులు ఇస్తేనే ఫైల్ ముందుకు కదులుతుంది.. లేదంటే ఏదో ఒక కొర్రీ పెట్టి రిజెక్ట్ చేస్తాం’’ అని కొందరు రెవెన్యూ సిబ్బంది బహిరంగంగానే తెగేసి చెబుతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భూమిని బట్టి వసూళ్లపర్వం..

భూమి విలువ, ప్రాంతాన్ని బట్టి లంచాల రేట్లు మారుతున్నాయి. సాధారణ వ్యవసాయ భూములైతే ఒక్కో దరఖాస్తుకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు.. అదే మున్సిపాలిటీలు లేదా పట్టణాలకు సమీపంలో ఉన్న కమర్షియల్ భూములైతే రూ.లక్షల్లో డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. పాత యజమానుల వారసులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారనో.. 2014 జూన్ 2 కంటే ముందే సాగులో ఉన్నట్లు పక్కా ఆధారాలు (పాత పహాణీలు లేదా శిస్తు రసీదులు) లేవనో సాకులు చెప్తూ దరఖాస్తుదారులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పలు తహసీల్దార్ కార్యాలయాల్లో జరుగుతున్న ఈ దందాపై విసిగిపోయిన కొందరు రైతులు ఏకంగా ఏసీబీ అధికారులను ఆశ్రయించడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఇనాం, వక్ఫ్, అసైన్డ్, అటవీ, భూదాన్, దేవాదాయ, సీలింగ్ భూములకు సంబంధించిన దరఖాస్తులు ప్రభుత్వం విధించిన నిబంధనలకు అనుగుణంగా లేవనే సాకుతో చాలా చోట్ల తిరస్కరిస్తున్నారు. కానీ, అదే సమయంలో చేతులు తడిపితే మాత్రం అక్రమంగా క్రమబద్ధీకరణలు జరుగుతున్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నతాధికారులు నల్లగొండ జిల్లాలోని అన్ని మండల కార్యాలయాల్లో సాదాబైనామా దరఖాస్తుల ప్రక్రియపై ప్రత్యేక నిఘా పెట్టాలని, లంచాలు డిమాండ్ చేసే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుని, అర్హులైన పేద రైతులకు ఉచితంగా క్రమబద్ధీకరణ పత్రాలు అందేలా చూడాలని ప్రజాసంఘాలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ఇటీవల పట్టుబడ్డ జేపీఓలు

ఇటీవల శాలిగౌరారం మండలంలోని ఒక జేపీఓ భూమి పట్టా కావాలంటే ఏకంగా రూ.22 వేల లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఉన్నతాధికారులకుకు ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో సదరు వ్యవహారం వైరల్ కావడంతో సదరు ఉద్యోగిని సస్పెండ్ చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రానికి సమీపంలో ఓ మండలంలోనూ ఓ జీపీఓ సాదాబైనామా, భూ క్రయవిక్రయాల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఫిర్యాదులు రావడంతో అతన్ని కలెక్టరేట్‌కు సరెండర్ చేశారు.

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>