రుణాల మంజూరులో బ్యాంకులు చొరవ చూపాలి: ఆదర్శ్ సురభి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: రైతులు, విద్యార్థులు, ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, మెప్మా సంఘాలు, స్వయం ఉపాధి రంగాలకు రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకులు మరింత చొరవ చూపాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన వనపర్తి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ (DLRC) సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల ద్వారా చేపట్టిన రుణాల పురోగతిపై సమీక్షించారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ. 5,990 కోట్ల జిల్లా వార్షిక రుణ ప్రణాళిక పుస్తకాన్ని కలెక్టర్ (Adarsh Surabhi) విడుదల చేశారు. విడుదల చేసిన వార్షిక రుణ ప్రణాళిక ప్రకారం బ్యాంకులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన బ్యాంకింగ్ సేవలను అందించాలని సూచించారు. రుణాల మంజూరులో సిబిల్ స్కోర్‌ను ఒక ప్రమాణంగా పరిగణించినప్పటికీ, అర్హులైన రైతులు, విద్యార్థులు, స్వయం ఉపాధి లబ్ధిదారులు రుణాల కోసం తిరస్కరణకు గురికాకుండా బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు. జిల్లాలో కొన్ని బ్యాంకులు వివిధ ప్రభుత్వ పథకాల కింద రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నాయని, అటువంటి బ్యాంకులు వెంటనే తమ పనితీరును మెరుగుపరుచుకుని లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు.

కేంద్ర ప్రభుత్వ బీమా పథకాలు అయిన సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజనకు సంబంధించి ప్రతి బ్యాంకు లక్ష్యాలను సాధించాలని ఆదేశించారు. ఖాతాదారులందరికీ ఈ బీమా పథకాలను అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల కింద రుణాలు తీసుకునే ప్రతి ఒక్క లబ్ధిదారుకు బీమా పథకాలను వర్తింపజేయాలని తెలియజేశారు. విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా రుణాల విషయంలో బ్యాంకులు ఆలస్యం చేయకుండా, నిబంధనల మేరకు  రుణాలను వెంటనే మంజూరు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, ఆర్బీఐ ఎల్డీఓ ప్రదీప్ చంద్ర, నాబార్డ్ డీడీ ఎం.మనోహర్ రెడ్డి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏజీఎం మురళీకృష్ణ, ఎస్బీఐ ఆర్ఎం చరణ్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శివకుమార్, ఇతర బ్యాంకు ప్రతినిధులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఆడబిడ్డలతో పెట్టుకుంటే అధికారమే పోతుంది: రేవంత్ రెడ్డి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>