హరీశ్ రావు వ్యాఖ్యలకు శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్

కలం, వెబ్ డెస్క్: పెద్దపల్లి (Peddapalli) జిల్లా పర్యటనలో ఆదివారం బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు.. రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్‌పై ప్రజలు విసిగిపోయారనడం తమ భ్రమ అంటూ చురకలు అంటించారు. రెండున్నరేళ్ల తమ ప్రజాపాలన చూసి గులాబీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ అహంకారానికి ప్రజలు ఆల్రెడీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని దుయ్యబట్టారు. అసెంబ్లీ, లోక్ సభ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లీడర్లు తలకిందులుగా తపస్సు చేసినా.. మునిగిపోయే కారుకు 10 సీట్లు కూడా రావు అని, 100 సీట్లు అనే పగటి కలలు మానండి అంటూ కౌంటర్ వేశారు.

భూముల ధరలు తగ్గాయనడం హాస్యాస్పదం..

పెద్దపల్లి జిల్లాలో భూముల ధరలు తగ్గాయని హరీశ్ రావు (Harish Rao) విమర్శించడం హాస్యాస్పదం, దుర్మార్గమని చెప్పారు. హరీష్ రావు.. పదేళ్ల మీ పాలనలో తమ పార్టీ నాయకులు, ల్యాండ్ మాఫియా కలిసి కృత్రిమంగా రేట్లు పెంచలేదా? అని ప్రశ్నించారు. పెద్దపల్లిలో సామాన్యుడు గజం భూమి కొనాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి తెచ్చింది వాస్తవం కాదా హరీశ్ రావు? అంటూ దుయ్యబట్టారు. పోలీసులను ప్రగతి భవన్ కాపలాదారులుగా మార్చి, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది మీ కేసీఆర్ కాదా? అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల హక్కులకు, వారి సంక్షేమానికి సంపూర్ణంగా కట్టుబడి ఉందని చెప్పారు. జీతాల కోత, అలవెన్సుల రద్దు అనేవి తమ ఐటీ సెల్ సృష్టించిన అభూతకల్పనలు మాత్రమేనని ఆరోపించారు.

పోలీసుల హక్కులకు అత్యంత ప్రాధాన్యత..

శాంతిభద్రతలను కాపాడే పోలీసుల సంక్షేమానికి, వారి హక్కులకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని శ్రీధర్ బాబు (Sridhar Babu) చెప్పారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తూ, సమాజంలో విద్వేషాలు రేకెత్తించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటే.. దానిని కక్షపూరితం అనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలో ఆదివారం జరిగిన తమ పార్టీ సమావేశంలో ప్రభుత్వ, పోలీస్ అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ తాము అధికారంలోకి వచ్చాకా ‘బుద్ధి చెబుతాం’ అని బహిరంగంగా హెచ్చరించడం ఒక మాజీ మంత్రిగా తగదు అని హితవు పలికారు. చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి అధికారికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఎవరో చేసే తాటాకు చప్పుళ్లకు భయపడొద్దని ప్రతి అధికారికి సూచించారు.

Read Also: మీ ఇంటి ముందే ప్రెస్ మీట్ పెడతా.. కవితకు రఘనందన్ వార్నింగ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>