కలం, నల్లగొండ బ్యూరో : ఆడుకోవడానికి వెళ్లిన ఓ చిన్నారి సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. ఇంటి ముందు ఆపి ఉన్న కారులోకి వెళ్లిన చిన్నారి, సెంట్రల్ లాక్ పడటంతో ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలిన హృదయవిదారక ఘటన నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి (Narketpally) మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నార్కట్‌పల్లికి చెందిన చరణ్య (6) స్థానిక పాఠశాలలో ఎల్‌కేజీ (LKG) చదువుతోంది. మంగళవారం సెలవు దినం కావడంతో మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటూ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారులోకి వెళ్లింది. కారు డోర్ వేసుకోగానే సెంట్రల్ లాక్ పడిపోవడంతో చిన్నారి లోపలే చిక్కుకుపోయింది. తీవ్రమైన ఎండ, లోపల గాలి ఆడకపోవడంతో చిన్నారి స్పృహ కోల్పోయి మృతి చెందింది.
పాప కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, నానమ్మ స్థానికులతో కలిసి పరిసర ప్రాంతాలన్ని వెతికారు. ఎంతకీ ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి ఇంటి ముందున్న కారులో చూడగా.. వెనుక సీట్‌లో చరణ్య నిద్రిస్తున్నట్లుగా పడి ఉంది. వెంటనే పాపను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కారు డ్రైవర్ పక్కన ఉన్న డోర్ లాక్ సరిగ్గా పని చేయకపోవడంతో పాప సులువుగా లోపలికి వెళ్లగలిగిందని, అయితే లోపలికి వెళ్లాక అది లాక్ అయిపోయిందని కారు యజమాని తెలిపారు. పాప చేతిలో పెన్సిల్, స్కేల్ ఉన్నాయని, ఆడుకోవడానికి లోపలికి వెళ్లి ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. “సెలవు కాకపోయి ఉంటే నా బిడ్డ స్కూలుకు వెళ్లేది. ఈ ఘోరం జరిగేది కాదు” అంటూ చరణ్య తండ్రి కన్నీరు మున్నీరవుతున్నారు. ఉదయం తనతో ఫోన్‌లో మాట్లాడి ‘డాడీ తిన్నావా’ అని అడిగిందని, ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

