కలం, వెబ్ డెస్క్ : ఏ శుభకార్యమైనా తొలిపూజ అందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు. కోరికలను నెరవేర్చడంలో కూడా వినాయకుడు (Lord Ganesh) ముందు ఉంటాడని పెద్దలు చెబుతారు. అయితే అసలు విఘ్నేశ్వరుడికి ఎన్ని రూపాలున్నాయో.. ఒక్కో రూపం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటో మీకు తెలుసా? ముద్గల పురాణం (Mudgala Purana) ప్రకారం 32 గణపతి స్వరూపాలు ఉన్నాయి. కోరికలను బట్టి ఆయా రూపాలను కొలిస్తే ఫలితం తక్షణమే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. వినాయక ఆరాధనలో 32 రూపాలు ఉండగా, వాటిలో మొదటి 16 రూపాలను ‘షోడశ గణపతులు’ అని పిలుస్తారు. ఇవి అత్యంత మహిమాన్వితమైనవి.
ఏ రూపం.. ఏ ఫలితం?
బుద్ధి వికాసం : చదువులో రాణించాలన్నా, బుద్ధి చురుగ్గా పనిచేయాలన్నా బాల గణపతి, తరుణ గణపతి, ద్విజ గణపతిలను పూజించాలి.
విజయాల కోసం: ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలంటే సిద్ధి గణపతి, విజయ గణపతి, విఘ్న గణపతిలను ఆరాధించాలి.
ధైర్యం, శక్తి: ఆత్మస్థైర్యం పెరగడానికి, కష్టాలను ఎదిరించే ధైర్యం కోసం వీర గణపతి, శక్తి గణపతిలను సేవించాలి.
ఐశ్వర్యం, శుభాలు: సంపద కోసం లక్ష్మీ గణపతిని, సమస్త శుభాల కోసం మహా గణపతిని కొలవాలి.
ప్రశాంతత: మనశ్శాంతి, సంతృప్తి కోసం నృత్య గణపతిని ఆరాధించాలి.
కష్టాల నివారణ: ఆపదల నుండి తక్షణ ఉపశమనం కోసం క్షిప్ర గణపతి, ప్రయాణాల్లో రక్షణకు హేరంబ గణపతి, నిందల నుండి విముక్తికి ఊర్ధ్వ గణపతిని పూజించాలి.
గణపతుల స్వరూపాలు:
ఈ ప్రతి రూపంలోనూ గణేశుడు (Lord Ganesh) విశిష్ట ఆయుధాలు, ఫలాలను ధరించి దర్శనమిస్తారు. ఉదాహరణకు వీర గణపతి 16 చేతులతో ఆయుధాలను ధరించి ఉంటే, భక్త గణపతి భక్తిని పెంచే నైవేద్యాలతో కనిపిస్తారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా ఉచ్చిష్ట గణపతికి ప్రత్యేక గుర్తింపు ఉంది. శాస్త్ర వచనాన్ని అనుసరించి మన సమస్య లేదా లక్ష్యానికి అనుగుణంగా ఆయా గణపతి స్వరూపాన్ని ఉపాసించడం వల్ల విఘ్నాలు తొలగి, సర్వ కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
Read Also: తమలపాకుకు ఎందుకింత విశిష్టత?
Follow Us On: Instagram

