కలం, నేషనల్ డెస్క్: పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కోసం భారీ స్థాయిలో కేంద్ర పారా మిలిటరీ బలగాలు మోహరించనున్నాయి. ఈ నెల 23న ఫస్ట్ ఫేజ్ పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని 2,407 కంపెనీల కేంద్ర మిలిటరీ, పారా మిలిటరీ బలగాలు వెళ్తున్నాయి. ఓటర్లు ఎటువంటి భయం లేకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో భారీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో ఎక్కువగా సీఏపీఎఫ్ (CAPF) బలగాలు ఉంటున్నాయి. ముర్షీదాబాద్ జిల్లాలో అత్యధికంగా 316 కంపెనీలను ఈసీ తరలిస్తున్నది. ఇందులో ముర్షిదాబాద్ పోలీస్ జిల్లాకు 240, జంగీపూర్ ప్రాంతానికి 76 కంపెనీలు కేటాయింపు జరిగింది. రాజకీయంగా కీలకమైన ‘నందిగ్రామ్’ నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని పూర్బా మేదినీపూర్ జిల్లాకు 273 కంపెనీలను ఈసీ కేటాయించింది.
ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షనేత సువేందు అధికారి బీజేపీ తరఫున పోటీ చేస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ తరఫున పబిత్రా కర్ పోటీ చేస్తున్నారు. సువేందు అధికారి గతంలో తృణమూల్ కాంగ్రెస్‌లో ఉండి ఆ తర్వాత బీజేపీలో చేరారు. ఇక్కడ పోటీని రెండు పార్టీలూ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో హింసాత్మక ఘటనలకు తావులేకుండా ఈసీ అదనపు జాగ్రత్తలు తీసుకున్నది. మొత్తం 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి రెండు దశల్లో పోలింగ్ జరగనున్నది. ఫస్ట్ ఫేజ్ పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుండగా సెకండ్ ఫేజ్ ఏప్రిల్ 29న జరగనున్నది. గడచిన ఐదేండ్ల కాలంలో బెంగాల్(West Bengal)లో వివిధ సందర్భాల్లో నెలకొన్న అశాంతి పరిస్థితులు, ఘర్షణల తీవ్రత, శాంతిభద్రతలకు కలిగిన విఘాతం తదితరాలను పరిగణనలోకి తీసుకుని ఈసీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది.
కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ చట్టం తెచ్చినప్పుడు బెంగాల్‌లోని ముర్షీదాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిరసనలు, ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కేంద్ర హోంశాఖ నేషనల్ రిజిస్ట్రీ ఆఫ్ సిటిజెన్స్ (NRC) నిర్ణయం తీసుకున్నప్పుడూ ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని సున్నితమైన ప్రాంతాల కోణం నుంచి కేంద్ర పారా మిలిటరీ బలగాలను నియమించాలని ఈసీ నిర్ణయం తీసుకున్నది. ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో కేంద్ర బలగాలు రూట్ మార్చ్‌లు నిర్వహిస్తున్నాయి. బెంగాల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలన్న ఉద్దేశంతో ఈసీ ఆదేశం మేరకు మోహరించే కేంద్ర బలగాలు (కంపెనీల సంఖ్య) జిల్లాలవారీగా ఇలా ఉన్నాయి.
ముర్షిదాబాద్ 316
పూర్బా మేదినీపూర్ 273
అసన్సోల్-దుర్గాపూర్ 125
జల్పాయ్‌గురి 92
అలీపుర్దువార్ 77
రాయ్‌గంజ్ (ఉత్తర దినాజ్‌పూర్) 71
డార్జిలింగ్ 61
ఇస్లాంపూర్ 61
సిలిగురి 44
కాలింపాంగ్ 21

