రైస్ మిల్లర్లపై ‘ఆర్‌ఆర్’ అస్త్రం: ప్రభుత్వం సంచలన నిర్ణయం!

కలం, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ ధాన్యాన్ని తీసుకుని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (CMR) బకాయిలను చెల్లించకుండా ఉన్న రైస్‌ మిల్లర్ల (Telangana Rice Millers)పై ఉక్కుపాదం మోపేందుకు రంగం సిద్ధమైంది. బకాయిలను వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ (RR) చట్టాన్ని ప్రయోగించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ధాన్యాన్ని తిరిగి ఇవ్వకుండా బకాయిపడిన మిల్లర్ల ఆస్తులను అవసరమైతే జప్తు చేసి, వేలం ద్వారా ప్రభుత్వ నష్టాన్ని భర్తీ చేయనున్నారు.

తనిఖీల్లో రైస్‌ మిల్లుల గోదాముల్లో ప్రభుత్వ ధాన్యం నిల్వలు తక్కువగా ఉన్నట్లు తేలితే సంబంధిత మిల్లర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయనున్నారు. దీనిపై ఏడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే నిబంధనల ప్రకారం రికవరీ చర్యలు చేపట్టనున్నారు. తొలుత మిల్లుల యంత్రాలు, వాహనాలు, బ్యాంకు ఖాతాలు వంటి ఆస్తులపై చర్యలు తీసుకోనున్నారు. వీటి ద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టం పూర్తిగా భర్తీ కాకపోతే భూములు, ఇళ్లు వంటి స్థిరాస్తులను కూడా సీజ్‌ చేసి బహిరంగ వేలం వేసే అవకాశం ఉంది.

పక్కాగా తనిఖీలు.. పకడ్బందీగా రికార్డులు

ఈ చర్యల్లో ఎలాంటి న్యాయపరమైన లోపాలు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. అక్టోబర్‌ 5 నుంచి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది. తనిఖీల నిర్వహణ, పంచనామాల నమోదు, వీడియో ఆధారాల సేకరణ, బకాయిల నిర్ధారణ, రికవరీ ప్రక్రియ వంటి అంశాలపై అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

డిప్యూటీ తహసీల్దార్లు, అసిస్టెంట్‌ సివిల్‌ సప్లైస్‌ ఆఫీసర్లకు తనిఖీలు, పంచనామాలు, వీడియో ఆధారాల సేకరణపై ఫీల్డ్‌ ట్రైనింగ్‌ ఇస్తారు. బకాయిలను కచ్చితంగా లెక్కించడం, రికవరీ రికార్డులను నిర్వహించడంపై అసిస్టెంట్‌ మేనేజర్లు, జిల్లా మేనేజర్లకు శిక్షణ ఇస్తారు. అలాగే బకాయి ఉన్న మిల్లర్ల ఆస్తులను గుర్తించడం, వాటిపై చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ అధికారులతో సమన్వయం చేయడంపై జిల్లా సివిల్‌ సప్లైస్‌ అధికారులకు మార్గదర్శకాలు అందించనున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>