కలం, యాదాద్రి భువనగిరి జిల్లా: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫిక్స్డ్ టెన్యూర్ (FTE) ఉద్యోగులకు గ్రాట్యుటీ సౌకర్యం కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 548 జారీ చేయడంపై యాదాద్రి భువనగిరి జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జాక్ కమిటీ (FTE Employees JAC) హర్షం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం పట్ల ప్రభుత్వానికి, సహకరించిన అధికారులకు కమిటీ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్కు సానుకూల స్పందనగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గ్రాట్యుటీకి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,800 మంది ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. అర్హత, సర్వీసు నిబంధనలను బట్టి ఒక్కో ఉద్యోగికి గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు గ్రాట్యుటీ లభించే అవకాశం ఉన్నట్లు వార్తా కథనాలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో జిల్లా ఉపాధి హామీ ఉద్యోగుల జాక్ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ కమిషనర్ సరిత, సీఈఓ శోభారాణి, డీఆర్డీఓ నాగిరెడ్డి, డీపీఓ, డిప్యూటీ సీఈఓలను కలిసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రాట్యుటీ సౌకర్యం ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, వారి దీర్ఘకాలిక సేవలకు గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ఈ ప్రయోజనం కల్పించిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఈసీల రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర జాక్ కో-చైర్మన్ బి. రాజశేఖర్, ఏపీవోల జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర జాక్ మహిళా చైర్మన్ ఎస్. శ్రీలక్ష్మి, ఉపాధి హామీ ఉద్యోగులు పాల్గొన్నారు.

