కలం, వెబ్ డెస్క్: బీహార్లో జనతాదళ్ (యునైటెడ్ జేడీయూ) ఎమ్మెల్యే అనంత్ కుమార్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వివాదానికి దారితీశాయి. మాజీ సీఎం నితీశ్ కుమార్కు (Anant Kumar Singh) సహాయం చేయడం కోసం, తాను తొమ్మిది మందిని హత్య చేయించానని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన రాజకీయ ప్రత్యర్థి నీరజ్ కుమార్కు జేడీయూ అవకాశం కల్పించడంపై అసంతృప్తితో ఉన్న అనంత్ సింగ్.. తన ప్రత్యర్థిపై విమర్శలు చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘నితీశ్ కుమార్తో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. ఆయనకు సహాయం చేయడం కోసం నేను తొమ్మిది మందిని హత్య చేయించాను. రాజకీయంగా నిలదొక్కుకునేందుకు ఆయన కష్టపడుతున్న సమయంలో అండగా నిలిచా’’ అని వ్యాఖ్యలు చేశారు. తనతో విభేదాలున్న వ్యక్తికి పార్టీ ఎందుకు టికెట్ ఇచ్చిందని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై ఆర్జేడీ నేత శక్తి సింగ్ యాదవ్ స్పందిస్తూ, ఇవి రాజకీయ హత్యలకు సంబంధించిన అంగీకార ప్రకటనలేనని ఆరోపించారు. నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తొమ్మిది హత్యలు జరిగాయని, ఆయన కోసం అవి జరిగినట్లు అనంత్ సింగ్ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని విమర్శించారు. అనంత్ సింగ్ ఆ తర్వాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నా, బీహార్లో రాజకీయ ఆధిపత్యం కోసం నితీశ్ కుమార్ వివిధ ప్రాంతాలకు చెందిన నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు కొనసాగించారని ఆర్జేడీ ఆరోపించింది.
అనంత్ సింగ్ వ్యాఖ్యలపై జేడీయూ వెంటనే స్పందించింది. వాటికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ ప్రసాద్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. నితీశ్ కుమార్కు నేరగాళ్లతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను తోసిపుచ్చిన ఆయన.. హింస, నేరాలు, ఇతర వివాదాస్పద అంశాలతో సంబంధం లేని స్వచ్ఛమైన రాజకీయ రికార్డు నితీశ్ కుమార్ సొంతమని అన్నారు. అనంత్ సింగ్ చేసినట్లుగా ప్రచారంలోకి వచ్చిన వ్యాఖ్యలకు పార్టీ ప్రాధాన్యం ఇవ్వదని, ప్రజలు కూడా వాటిని తీవ్రంగా పరిగణించరని తెలిపారు. అయితే, ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో అనంత్ సింగ్ తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గారు. తాను నితీశ్ కుమార్ కోసం తొమ్మిది మందిని హత్య చేయించానని చెప్పలేదని, తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.
‘‘లాలూ యాదవ్ ప్రభుత్వ హయాంలో నా అనుచరులు తొమ్మిది మంది హత్యకు గురయ్యారని, నాపై కూడా కాల్పులు జరిగాయని చెప్పాలనుకున్నాను. మేము నితీశ్ కుమార్తో కలిసి పనిచేయడం వల్లే లాలూ యాదవ్ మా అనుచరులను హత్య చేయించారని నా ఉద్దేశం’’ అని ఆయన పేర్కొన్నారు. బీహార్లో ఎన్నికల వేడి కొనసాగుతున్న సమయంలో ఈ రాజకీయ వివాదం తెరపైకి వచ్చింది. అనంత్ సింగ్ వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన ఇచ్చిన వివరణ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

