కలం, యాదగిరిగుట్ట: ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం వైద్య ఆరోగ్య శాఖ పనితీరుపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా శుక్రవారం గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (Gundala PHC) జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Collector Anuraag Jayanti) ఆకస్మికంగా తనిఖీ చేసి, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న చికిత్స, ఔట్ పేషెంట్ (ఓపీ) నమోదు, ప్రయోగశాల పరీక్షలు, వైద్య సేవల నిర్వహణకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ప్రతిరోజూ ఆసుపత్రికి ఎంతమంది రోగులు వస్తున్నారు? వారికి ఎలాంటి వైద్య సేవలు అందుతున్నాయి? అవసరమైన పరీక్షలు సకాలంలో నిర్వహిస్తున్నారా? అనే వివరాలను కలెక్టర్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్‌తో పాటు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ (ఏబీహెచ్ఏ) నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగుల వివరాలను రిజిస్టర్లలో సక్రమంగా నమోదు చేయాలని, వైద్య సేవలకు సంబంధించిన రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. ఆసుపత్రి ప్రయోగశాలలో నిర్వహిస్తున్న పరీక్షలు, ఆరోజు సేకరించిన శాంపిళ్ల సంఖ్యను రిజిస్టర్ల ఆధారంగా పరిశీలించారు. రోగులకు అవసరమైన వైద్య పరీక్షలను ఆలస్యం చేయకుండా నిర్వహించి, పరీక్షల ఫలితాల ఆధారంగా తగిన చికిత్స అందించాలని స్పష్టం చేశారు.
రోగులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్..
తనిఖీలో భాగంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. వారు ఏ ఆరోగ్య సమస్యతో ఆసుపత్రికి వచ్చారు? ఎన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు? వైద్యులు, సిబ్బంది సక్రమంగా సేవలు అందిస్తున్నారా? అని అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వైద్య సేవల పరిస్థితిని తెలుసుకునేందుకు రోగుల నుంచి వివరాలు సేకరించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్యులు, వైద్య సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు అవసరమైన వైద్య పరీక్షలు, చికిత్స అందుబాటులో ఉండేలా చూడాలని, సేవల నాణ్యతలో రాజీ పడకూడదని పేర్కొన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ తనిఖీలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి, చేనేత మరియు జౌళి శాఖ అధికారి శ్రీనివాస్, ఎంపీడీవో, గుండాల పీహెచ్సీ వైద్యాధికారి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

