కలం, వరంగల్: వరంగల్ శ్రీ భద్రకాళి దేవస్థానంలో (Bhadrakali Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు నాలుగో రోజు ఘనంగా జరిగాయి. బుధవారం అమ్మవారిని మహాలక్ష్మిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై సావిత్రి మాతగా, సాయంత్రం హంస వాహనంపై బ్రాహ్మీ మాతగా అమ్మవారిని ఊరేగించారు. తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అనుగ్రహ భాషణం చేసి, ఆలయంలో నిర్మాణంలో ఉన్న నూతన రథాన్ని పరిశీలించారు.
భక్తులకు తాగునీరు, ప్రత్యేక క్యూలైన్లు, భోజన సౌకర్యాలు కల్పించారు. భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. హరికథ, భక్తి సంగీతం, కర్ణాటక సంగీతం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు భక్తులను అలరించాయి. ఆలయ ఈవో రామల సునీత, ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

