కలం, హనుమకొండ: షూటింగ్ క్రీడలో హనుమకొండ (Hanumakonda)కు చెందిన యువ క్రీడాకారుడు వేముల శ్రీఆంష్ ప్రతిభ చాటాడు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో నిర్వహించిన ప్రీ-నేషనల్ పోటీల్లో అండర్-19 విభాగం 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ (Air Pistol) ఈవెంట్లో ద్వితీయ స్థానం సాధించి, వచ్చే నెల ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి షూటింగ్ పోటీలకు (National Shooting Championships) తెలంగాణ తరఫున ఎంపికయ్యాడు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్లో అడిషనల్ డీసీపీ (ఏఆర్)గా పనిచేస్తున్న వేముల శ్రీనివాస్ కుమారుడైన శ్రీఆంష్ ప్రస్తుతం కాకతీయ డిగ్రీ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. క్రమశిక్షణ, నిరంతర సాధనతో పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
జాతీయస్థాయి పోటీల్లోనూ ఇదే ప్రతిభను కొనసాగించి పతకం సాధించాలని ఆకాంక్షించారు. శ్రీఆంష్ను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు, శిక్షణకు సహకరిస్తున్న కళాశాల యాజమాన్యం, ఫిజికల్ డైరెక్టర్లను అభినందించారు.

