ఓటు చోరీతో ప్రజాస్వామ్యానికి ముప్పు: శివసేన రెడ్డి

కలం, వనపర్తి: ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే పునాది అని, ప్రతి ఓటును కాపాడుకోవడం దేశ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడంతో సమానమని డీసీసీ అధ్యక్షుడు శివసేనరెడ్డి (Shiva Sena Reddy) అన్నారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగిస్తున్నారంటూ కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై విమర్శలు గుప్పించారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా ‘ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో’ నినాదంతో పోరాటం సాగిస్తోందని పేర్కొన్నారు. ఆదివారం వనపర్తి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో శివసేనరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ నేత, ఉమ్మడి జిల్లా ‘ఓట్‌ బచావో.. దేశ్‌ బచావో’ కార్యక్రమ పరిశీలకుడు రవీంద్రదాస్‌, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి సిద్ధేశ్వర్‌, నియోజకవర్గ సర్‌ ప్రక్రియ కోఆర్డినేటర్‌ శత్రుబుజ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివసేనరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటరే కీలకమని, ప్రజల చేతిలో ఉన్న ఓటు హక్కును బలహీనపరిచే ప్రయత్నాలను సహించబోమన్నారు. ఓటర్ల జాబితాల నుంచి అర్హులైన వారి పేర్లు తొలగుతున్నాయన్న ఆరోపణలపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఓటు హక్కును కాలరాస్తే సహించం

రవీంద్రదాస్‌ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కుల్లో ఓటు హక్కు అత్యంత కీలకమైందన్నారు. ప్రజల ఓట్లతో ఏర్పడిన ప్రభుత్వాలు అదే ఓటు హక్కును దెబ్బతీసేలా వ్యవహరిస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఓటు హక్కును కాలరాసే ప్రయత్నాలు జరిగితే ప్రజలు ప్రతిఘటిస్తారని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తుందని, ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తామని తెలిపారు.

మోదీ సర్కారుపై సమరశంఖం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డీసీసీ అధ్యక్షుడు శివసేన రెడ్డి కాంగ్రెస్‌ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటర్ల హక్కుల అంశాలపై ఏఐసీసీ పిలుపు మేరకు నవంబరు 1న ఢిల్లీలో నిర్వహించనున్న మహాధర్నాకు వనపర్తి జిల్లా నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఓటర్ల హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రతి మండలంలో 500 మంది పట్టభద్రులను, ప్రతి మున్సిపాలిటీలో 800 నుంచి 1,000 మంది వరకు ఓటర్లుగా నమోదు చేయించేలా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని సూచించారు.

కరువుపై బీఆర్‌ఎస్‌ ప్రచారం హాస్యాస్పదం

తెలంగాణలో కరువు పరిస్థితులపై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న ప్రచారం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్లుగా అమలు చేస్తున్న విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను వాస్తవాలతో తిప్పికొట్టాలన్నారు. తెలంగాణలోనే కరువు నెలకొన్నట్లు చిత్రీకరిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. గ్రామస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ విధానాలు, ప్రజా సమస్యలపై అవగాహన కల్పించాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతయ్య, సాయి చరణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మచారి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీలతరెడ్డి, మైనార్టీ జిల్లా అధ్యక్షుడు ఐయూబ్‌ఖాన్‌, వనపర్తి మండల అధ్యక్షుడు నక్క రవికిరణ్‌, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు రాజ్‌కుమార్‌, జిల్లా అధికార ప్రతినిధులు కోళ్ల వెంకటేష్‌, బోయజ్‌, నరహరి, విష్ణు ముదిరాజ్‌, యాదగిరి, కృష్ణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌, పెబ్బేరు మున్సిపల్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌గౌడ్‌, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా, మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>