రోడ్డు భ‌ద్ర‌త‌, డ్ర‌గ్స్ నివార‌ణ‌పై క‌లెక్ట‌ర్ స‌మీక్ష‌

కలం, వనపర్తి: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వ‌న‌ప‌ర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శుక్రవారం వనపర్తి కలెక్టరేట్‌లో ఎస్పీ సునీతారెడ్డితో కలిసి రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, జాతీయ రహదారులపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. అసంపూర్తి రహదారి పనులను త్వరగా పూర్తి చేయడంతో పాటు అవసరమైన చోట హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని, అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. కొత్తకోట మదర్ థెరిసా జంక్షన్‌, పెద్దమందడి మండలం బలిజపల్లి క్రాస్‌రోడ్డు వద్ద ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో అత్యవసర వైద్యం అందించే ప్రధానమంత్రి రాహత్ పథకం అమలుపై అధికారులకు సూచనలు చేశారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు

జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పాఠశాలలు, కళాశాలల్లో యాంటీ డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేసి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారుల అధికారులు, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు విద్యాసంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఖీమ్యా నాయక్‌, డీఎస్పీలు బాలాజీ నాయక్‌, గిరిబాబు, డీఆర్వో రామ్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>