కలం, వనపర్తి: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులకు నగదు రహిత అత్యవసర వైద్య చికిత్స అందించి, ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి రాహత్ పథకాన్ని (PM Rahat Scheme) జిల్లాలో పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి (Adarsh Surabhi) అధికారులను ఆదేశించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పథకం అమలు విధానాలపై సమీక్షించారు. అనంతరం జిల్లా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. పీఎం రాహత్ పథకం కింద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు 112 లేదా 108కు సమాచారం అందించి సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేటు ఆసుపత్రికి చేరుకుంటే, ఆరోగ్యశ్రీ టీఎంఎస్ పోర్టల్‌లో వివరాలు నమోదు చేసి నగదుతో సంబంధం లేకుండా అత్యవసర చికిత్స అందిస్తారని అధికారులు వివరించారు. ప్రమాద వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపించగా, స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఘటనపై విచారణ జరిపి నివేదికను ఆసుపత్రికి అందజేస్తారు. ఈ పథకం కింద ఒక్కో ప్రమాద బాధితుడికి రూ.1.50 లక్షల వరకు అత్యవసర వైద్య చికిత్స అందించే అవకాశం ఉంది. చికిత్స ఖర్చులను నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే నిధులతో చెల్లిస్తారు.
జిల్లాలో 9 ఆసుపత్రుల నమోదు
వనపర్తి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులతోపాటు శ్రీ సరోజినీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, సుధా నర్సింగ్ హోమ్, రాహుల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, త్రినేత్ర ఆసుపత్రి తదితర మొత్తం తొమ్మిది ఆసుపత్రులు పీఎం రాహత్ పథకం కింద నమోదయ్యాయని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఎక్కడ రోడ్డు ప్రమాదం జరిగినా బాధితులకు సత్వరమే అత్యవసర వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. ప్రమాదాల వివరాలను పోలీసులు సకాలంలో ధ్రువీకరించి, సంబంధిత ఆసుపత్రులకు నివేదికలు పంపించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ డి. సునీతారెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్, డీఎస్పీ బాలాజీ నాయక్, డీఆర్వో రాంరెడ్డి, సెక్షన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

