బార్లపై ప్రివిలేజ్‌ ఫీజు భారం.. వనపర్తిలో బార్ల బంద్‌!

కలం, వనపర్తి: బార్లపై అదనపు పన్నులు, ఫీజుల భారం తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ వనపర్తి జిల్లావ్యాప్తంగా బార్‌ అండ్ రెస్టారెంట్ల యజమానులు శుక్రవారం బంద్‌ (Wanaparthy Bar Shutdown) పాటించారు. తెలంగాణ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌ పిలుపు మేరకు ఈ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలో బార్‌ అండ్ రెస్టారెంట్ యజమానులు విలేకరుల సమావేశం నిర్వహించి ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొత్తగా విధించిన ప్రివిలేజ్‌ ఫీజును ఉపసంహరించుకోవాలని, ఇప్పటికే పెరిగిన లైసెన్స్‌ ఫీజుల భారాన్ని మరింత పెంచవద్దని కోరారు. ప్రభుత్వం స్పందించకుంటే నిరవధిక బంద్‌తోపాటు లైసెన్సులను సరెండర్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

పన్నుల భారంతో ఇబ్బందులు

బార్ల అద్దె ఆధారంగా లైసెన్స్‌ ఫీజులపై 8 నుంచి 16 శాతం వరకు ప్రివిలేజ్‌ ట్యాక్స్‌ విధించడం వల్ల వ్యాపార నిర్వహణ భారంగా మారిందని బార్‌ అండ్ రెస్టారెంట్ యజమానులు తెలిపారు. అదనపు ప్రివిలేజ్ టాక్స్ రూ.30 లక్షల నుంచి రూ.39 లక్షల వరకు 8 శాతం, రూ.39 లక్షల నుంచి రూ.44 లక్షల వరకు 10 శాతం, రూ.44 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు 12 శాతం, రూ.50 లక్షల నుంచి రూ.58 లక్షల వరకు 14 శాతం, రూ.58 లక్షలకు మించిన వాటికి 16 శాతం పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో మద్యం కొనుగోలు వ్యయం పెరిగి, నిర్వహణ ఖర్చులు భారమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్టాక్‌ కేటాయింపు పరిమితిలో ఎమ్మార్పీపై సుమారు 14 శాతం లాభం వచ్చేదని, పరిమితి దాటితే అది 6 నుంచి 7 శాతానికి తగ్గేదని అన్నారు. పెరిగిన అద్దెలు, కార్మికుల వేతనాలు, ఇతర నిర్వహణ ఖర్చులకు అదనపు పన్నులు తోడవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

వనపర్తిలో బెల్ట్‌ షాపులను నియంత్రించాలి

రోడ్ల వెంట ఉన్న కొన్ని చిన్న హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారంతోపాటు మద్యం కూడా విక్రయిస్తున్నారని యజమానులు పేర్కొన్నారు. బెల్ట్‌ షాపుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బార్లలో మద్యం ధరలు పెరిగితే వినియోగదారులు ఇతర మార్గాలను ఆశ్రయించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మార్పీకి అనుగుణంగా విక్రయాలు కొనసాగిస్తూ పెరిగిన నిర్వహణ ఖర్చులను భరించడం కష్టంగా మారిందన్నారు.

బార్లపై ఆధారపడిన కుటుంబాల ఉపాధిపై ప్రభావం

ఒక్కో బార్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 నుంచి 35 కుటుంబాలు, కొన్ని చోట్ల 40 కుటుంబాల వరకు ఆధారపడి జీవిస్తున్నాయని బార్‌ అండ్ రెస్టారెంట్ యజమానులు తెలిపారు. బార్లు మూతపడితే కార్మికుల కుటుంబాల ఉపాధిపైనా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పన్నుల విధానంపై నిర్ణయం తీసుకునే ముందు తమతో చర్చించి ఉంటే సమస్యలను వివరించే అవకాశం ఉండేదన్నారు.

గతంలోనూ ఆందోళన.. పరిష్కారం సున్నా

ప్రివిలేజ్‌ ట్యాక్స్‌కు వ్యతిరేకంగా గతంలో రెండు రోజులపాటు బంద్‌ నిర్వహించి, ఎక్సైజ్‌ కమిషనర్‌, సంబంధిత మంత్రి, అధికారులకు వినతిపత్రాలు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని బార్‌ అండ్ రెస్టారెంట్ యజమానులు తెలిపారు. ప్రభుత్వం పన్నుల విధానంపై పునరాలోచించి అదనపు భారాన్ని తగ్గించాలని డిమాండ్‌ చేశారు. లైసెన్సులు సరెండర్‌ చేయాల్సి వస్తే ఇప్పటికే చెల్లించిన రెంటల్‌ ఫీజులను తిరిగి చెల్లించాలని కోరారు. సమావేశంలో బార్‌ అండ్ రెస్టారెంట్ యజమానులు సబ్బిరెడ్డి వెంకటరెడ్డి, నిరంజన్‌గౌడ్‌, వేణుగోపాల్‌గౌడ్‌, రాహుల్‌, సురేష్‌గౌడ్‌, బండారు గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>