బీఆర్ఎస్ రైతుల‌ను మ‌భ్య‌పెట్ట‌డం మానుకోవాలి: మేఘారెడ్డి

కలం, వనపర్తి: ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు న్యాయం చేయకుండా, ఇప్పుడు ధర్నాల పేరుతో రాజకీయాలు చేయడం బీఆర్ఎస్ నాయకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) విమర్శించారు. ఏదుల ప్రాజెక్టు (Edula Project) కోసం సుమారు 2,500 ఎకరాల భూములు సమకూర్చిన రైతులకు రూ.25 లక్షల పరిహారం ఎందుకు చెల్లించలేదో గత పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం రేవల్లి, ఏదుల మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

గతంలో అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఇచ్చిన హామీలు, చేసిన చెల్లింపులపై బీఆర్ఎస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని మేఘారెడ్డి అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించకుండా ఇప్పుడు ప్రజల పక్షాన ఉన్నట్లు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని సూచించారు. రైతులకు అందాల్సిన పరిహారం విషయంలో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని, ఇంకా పరిహారం అందని అర్హులైన రైతులకు సంబంధించి రూ.12.50 లక్షలు త్వరగా అందేలా చూడాలని ఆదేశించారు.

ఏదుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

కాంగ్రెస్ ప్రభుత్వం ఏదుల మండల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే (Megha Reddy) తెలిపారు. మండలంలో ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల నిర్మాణంతోపాటు ప్రజలకు ప్రభుత్వ సేవలు చేరువయ్యేలా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. కేజీబీవీ, ఎస్సీ, బీసీ వసతి గృహాలు, జూనియర్ కళాశాల, వ్యవసాయ శాఖ కార్యాలయం ఏర్పాటుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఏదుల పరిధిలోని సుమారు 400 ఎకరాలతోపాటు అనంతపురం గ్రామ సాగుభూములకు నీరందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అవసరమైతే మినీ లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించి సాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.

గోదాములు, వైద్య సేవలకు శ్రీకారం

ఏదుల మండల కేంద్రంలో 10 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల ధాన్యాగార గోదామును, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గోదాములతో రైతులు పండించిన ధాన్యాన్ని భద్రపరుచుకునే సదుపాయం కలుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. మండల కేంద్రానికి అంబులెన్స్ ఏర్పాటు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

రేవల్లి మండలం కొంకలపల్లిలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదామును ప్రారంభించారు. బండరావిపాకులలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి, ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధితోపాటు విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడంపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థుల వసతి గృహాలకు భూమిపూజ

వనపర్తి(Wanaparthy) పట్టణంలోని పీజీ కళాశాలకు చెందిన బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి వసతి గృహాలను అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. అనంతరం రేవల్లి మండల కేంద్రంలో అనారోగ్యంతో బాధపడుతున్న మున్నూరు నరసింహను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. శేఖర్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి తెలిపారు.

ప్రజా సంక్షేమం, రైతుల సమస్యల పరిష్కారం, విద్య, వైద్యం, సాగునీటి సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ మాధవి, ఎస్‌ఎల్‌ఎన్ రమేష్, వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు వాకిటి ఆదిత్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కే వెంకటేష్, వైస్ చైర్మన్ సత్యశీలారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Also Read : కోవిడ్​ లాంటి సంక్షోభం.. సీఎం సంచలన వ్యాఖ్యలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>