కలం, స్పోర్ట్స్: వెస్టిండీస్ బ్యాటర్లను కట్టడి చేయడం కాదు.. వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా ఆడాలని టీమిండియా వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (Tilak Varma) స్పష్టం చేశాడు. ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బుధవారం హైదరాబాద్లో జరగనున్న నాలుగో మ్యాచ్లో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ప్రస్తుతం భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్లో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ భారత్ సొంతమవుతుంది. అయితే, వెస్టిండీస్ బ్యాటింగ్ బలం తక్కువ అంచనా వేయకూడదని తిలక్ హెచ్చరించాడు.
చివరి బ్యాటర్ వరకు భారీ షాట్లు ఆడగల సామర్థ్యం ఆ జట్టుకు ఉందని పేర్కొన్నాడు. రెండో టీ20లో భారత్ 249 పరుగులు చేసినా, వెస్టిండీస్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ 45 బంతుల్లోనే 102 పరుగులు చేసి భారత్కు షాకిచ్చాడు. ఆ మ్యాచ్లో భారత బౌలర్లు వికెట్ల కోసం దూకుడుగా ప్రయత్నించకుండా, ప్రత్యర్థి పరుగులు చేస్తున్నప్పుడు రక్షణాత్మకంగా వ్యవహరించారని తిలక్ అంగీకరించాడు. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా వికెట్ల వేటపై దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలిపాడు.
మూడో టీ20లో భారత్ 14 పరుగుల తేడాతో గెలిచి తిరిగి ఆధిక్యంలోకి వచ్చింది. వెస్టిండీస్ను 209 పరుగులకే పరిమితం చేసింది. ఇదే జోరును కొనసాగిస్తూ బౌలింగ్ ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాలని భారత జట్టు భావిస్తోంది. బ్యాటింగ్ విషయంలోనూ జట్టు అవసరాలకు అనుగుణంగా ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తిలక్ తెలిపాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం తనకు ఇష్టమని, అయితే వికెట్లు త్వరగా పడితే ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత తీసుకుంటానని చెప్పాడు.
టాప్ ఆర్డర్ ఎక్కువసేపు ఆడితే తొలి బంతి నుంచే వేగం పెంచగలనని వివరించాడు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ కొత్త మట్టితో సిద్ధం చేసినందున, పరిస్థితులను అంచనా వేసిన తర్వాతే బ్యాటింగ్ వ్యూహాన్ని నిర్ణయిస్తామని తిలక్ తెలిపాడు. సొంత ప్రేక్షకుల ముందు భారత జట్టు వైస్ కెప్టెన్గా ఆడటం తనకు ప్రత్యేకమైన సందర్భమని పేర్కొన్నాడు.

