కలం, వెబ్ డెస్క్: పోలీసు యూనిఫామ్‌ను ధరించి ప్రైవేట్ కార్యక్రమాల్లో డ్యాన్సులు చేయడం, సోషల్ మీడియా రీల్స్ కోసం విచిత్ర వేషధారణలతో రీల్స్ చేయడంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) తీవ్రంగా స్పందించారు. యూనిఫామ్‌లో ఉన్నప్పుడు నిబంధనలను అతిక్రమించి ఇలాంటి అనధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
గత కొంతకాలంగా కొందరు పోలీసులు అధికారిక యూనిఫామ్‌లోనే వివాహాలు, ఇతర ప్రైవేట్ ఈవెంట్లలో డ్యాన్సులు వేస్తున్న వీడియోలు తీసి నెట్టింట్లో పోస్ట్ చేస్తుండగా, అవి కాస్తా వైరల్‌గా మారుతున్నాయి. ఈ తరహా ధోరణిపై తీవ్ర చర్చ జరగడంతో పాటు పోలీసు శాఖ క్రమశిక్షణపై తారాస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఇలాంటి ధోరణిపై స్పందించిన డీజీపీ.. పోలీసు యూనిఫామ్ అనేది కేవలం వస్త్రం కాదని, అది బాధ్యతకు, అధికారానికి, అలాగే అత్యున్నత క్రమశిక్షణకు ప్రతీక అని గుర్తుచేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘించి ఏ సిబ్బంది అయినా యూనిఫామ్ పవిత్రతకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తే వారిపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విధి నిర్వహణలో ఉన్నప్పుడు పోలీసుల గౌరవాన్ని, మర్యాదను కాపాడుతూ ప్రజల్లో శాఖపై మరింత నమ్మకం కలిగించేలా ప్రవర్తించాలని ఆయన సిబ్బందికి హితవు పలికారు.

